Site icon HashtagU Telugu

IND vs SL: సిరాజ్ కు ఆ సామర్థ్యం ఉంది… ప్రపంచకప్ లోనూ సత్తా చాటుతామన్న రోహిత్

Super Over

Super Over

IND vs SL: ఆసియా కప్ ఫైనల్లో భారత్ అదరగొట్టింది. టైటిల్ పోరులో శ్రీలంకను చిత్తుచిత్తుగా ఓడించి ఎనిమిదోసారి ట్రోఫీని ముద్దాడింది. ఈ మ్యాచ్ లో హైదరాబాదీ పేసర్ సిరాజ్ బౌలింగే హైలైట్. సంచలన స్పెల్ తో చెలరేగిన సిరాజ్ 6 వికెట్లు పడగొట్టి లంక పతనాన్ని శాసించాడు. ప్రస్తుతం సిరాజ్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మ సిరాజ్ సంచలన స్పెల్ పై స్పందించాడు. అతని వల్లే ఈ విజయం సాధ్యమైందంటూ ప్రశంసలతో ముంచెత్తాడు. ఏళ్లు గడిచినా ఈ విజయం మరిచిపోలేమన్నాడు. ముఖ్యంగా సిరాజ్ బౌలింగ్ పై రోహిత్ ప్రశంసలు కురిపించాడు.

గాలిలో బంతి మూవ్ చేసే పేసర్లు చాలా అరుదుగా ఉంటారని,. సిరాజ్‌కు ఆ సామర్థ్యం ఉందన్నాడు. మిగిలిన ఆటగాళ్లు కూడా చక్కగా ఆడారన్నాడు. పాకిస్థాన్‌తో తీవ్ర ఒత్తిడిలో హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారని గుర్తు చేశాడు. కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ సెంచరీలు చేసారని, ప్రతీ ప్లేయర్ తమ వంతు బాధ్యతను చక్కగా పోషించడంతోనే టైటిల్ గెలిచామన్నాడు. ఈ టోర్నీలో ఓ జట్టుగా తాము చేయాల్సినవన్నీ చేసామన్న రోహిత్ భారత్ వేదికగా జరిగే ప్రపంచకప్‌లోనూ సత్తా చాటుతామని చెప్పాడు.

ఫైనల్లో ఇలాంటి ప్రదర్శన ఖచ్చితంగా జట్టు కాన్ఫిడెన్స్ పెంచుతుందన్నాడు రోహిత్. మన పేసర్లు ఈ స్థాయిలో రాణిస్తారని అస్సలు ఊహించలేదన్న రోహిత్ జట్టు నైతిక స్థైర్యం మరింత పెరిగిందని వ్యాఖ్యానించాడు. వరల్డ్ కప్ కంటే ముందు ఆస్ట్రేలియాతో సిరీస్ లోనూ ఇదే జోరు కొనసాగిస్తామని రోహిత్ ధీమా వ్యక్తం చేశాడు. ఆసియాకప్ ఫైనల్ విజయంతో వరల్డ్ కప్ కు ముందు భారత్ కు సరికొత్త ఉత్సాహం వచ్చిందని చెప్పాలి. సొంతగడ్డపై మెగా టోర్నీలో ఫేవరెట్ గా బరిలోకి దిగుతున్న టీమిండియా ఇప్పుడు కొత్త జోష్ తో వరల్డ్ కప్ కు రెడీ అవుతోంది. దాని కంటే ముందు ఆసీస్ తో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం భారత జట్టును ఒకటిరెండు రోజుల్లో ప్రకటించనున్నారు.

Also Read: Uggani : రాయలసీమ స్పెషల్ ఉగ్గాని.. ఇంట్లోనే సింపుల్ గా ఎలా చేయాలో తెలుసుకోండి..

Exit mobile version