Orange Army: సన్ రైజ్ అయ్యేనా.. ఆరెంజ్ ఆర్మీ పై అంచనాలు

ఐపీఎల్ లో టైటిల్ కొట్టే సత్తా ఉన్న జట్లలో సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా ముందు వరుసలో ఉంటుంది. గత సీజన్ తో మాత్రం చెత్త ఆటతీరుతో 8 స్థానంతో సరిపెట్టుకున్న..

  • Written By:
  • Updated On - March 25, 2023 / 07:34 PM IST

Orange Army : ఐపీఎల్ లో టైటిల్ కొట్టే సత్తా ఉన్న జట్లలో సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా ముందు వరుసలో ఉంటుంది. గత సీజన్ తో మాత్రం చెత్త ఆటతీరుతో 8 స్థానంతో సరిపెట్టుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ వేలం తర్వాత తన టీమ్ లో చాలా మార్పులే చేసింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్‌తో సహా 12 మంది ఆటగాళ్లను వదిలేసి.. పనికొచ్చే ఆటగాళ్లపై మినీ వేలంలో కోట్లు కుమ్మరించింది. మయాంక్ అగర్వాల్, హరీ బ్రూక్, హెన్రీచ్ క్లాసెన్‌లను కొనుగోలు చేసి బ్యాటింగ్ బలం పెంచుకుంది. ఆదిల్ రషీద్, మయాంక్ మార్కేండేలతో స్పిన్‌ విభాగాన్ని కూడా పటిష్టం చేసుకుంది. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో తమ ఫ్రాంచైజీకి టైటిల్ అందించిన ఎయిడెన్ మార్క్‌రమ్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. గతంలో కంటే చాలా బలంగా కనిపిస్తున్న సన్‌రైజర్స్ ఈ సారి ఖచ్చితంగా టైటిల్ గెలవాలన్న పట్టుదలతో కనిపిస్తోంది. మినీ వేలం తర్వాత సన్ రైజర్స్ టీమ్ కూర్పు చాలా వరకూ మారిపోయింది. ప్రస్తుతం ఆ జట్టు బలాలను పరిశీలిస్తే సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రధాన బలం కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్.

ఇటీవల కాలంలో అతను సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ సత్తా చాటుతున్నాడు. సౌతాఫ్రికా టీ ట్వంటీ పగ్గాలు కూడా అందుకున్న మార్కరమ్ కు సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ కూడా కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. మార్క్‌రమ్‌ తో పాటు మరికొందరి కీలక ఆటగాళ్ళ ఎంట్రీతో ఆ జట్టు చాలా సమతూకంగా కనిపిస్తోంది. మయాంక్ అగర్వాల్, హరీ బ్రూక్, హెన్రీచ్ క్లాసెన్‌, రాహుల్ త్రిపాఠిలతో టీమ్ బ్యాటింగ్ డెప్త్ బాగా పెరిగింది. ముఖ్యంగా భారీ ధర పెట్టి కొన్న హ్యారీ బ్రూక్ ఫామ్ ఆ జట్టుకు మరో బలం. ఫార్మాట్ తో సంబంధం లేకుండా గత కొంతకాలంగా అదరగొడుతున్న బ్రూక్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఈ సీజన్ లో కీ ప్లేయర్. బ్రూక్ తన సూపర్ ఫామ్ కంటిన్యూ చేస్తే హైదరాబాద్ టీమ్ భారీస్కోర్లు చేయడం ఖాయం.

నెదర్లాండ్స్ తో సిరీస్ కారణంగా సౌతాఫ్రికా ప్లేయర్లు ఏప్రిల్ 3న ఐపీఎల్ ఆడేందుకు రానున్నారు. మరోవైపు బౌలింగ్ పరంగానూ గతంతో పోలిస్తే ఈ సారి సన్ రైజర్స్ కాస్త బలంగానే ఉంది. స్పీడ్ స్టార్ ఉమ్రాన్ మాలిక్, నటరాజన్ లకు తోడు సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్, స్పిన్నర్ ఆదిల్ రషీద్‌ జట్టులో ఉన్నారు. వీరంతా గతంలో ఈ జట్టుకు ఆడి ఉండడం కలిసొచ్చే అంశం. వేలంలో పలువురు యువ క్రికెటర్లను కూడా సన్ రైజర్స్ కొనుగోలు చేసింది. గత కొన్ని సీజన్లుగా జట్టుతో పాటు ఉన్న అబ్దుల్ సమద్ కు తోడు మార్కో జాన్సెన్, ఫజలక్ ఫరూకీ‌లతో బ్యాకప్ ను కూడా బలోపేతం చేసుకుంది. ఇదిలా ఉంటే సన్​రైజర్స్​ పేపర్​పై బలంగానే కనపడుతున్నా.. జట్టులోని చాలా మందికి ఆరెంజ్ ఆర్మీ (Orange Army) తరఫున ఆడటం ఇదే తొలిసారి. హెన్రీచ్ క్లాసెన్, హరీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, ఆదిల్ రషీద్‌లు తొలిసారి సన్‌రైజర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. హరీ బ్రూక్ అయితే ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా భారత్‌లో ఆడలేదు. ప్రధాన స్పిన్నర్‌గా ఆదిల్ రషీద్ ఉన్నా.. గతంలో సన్ రైజర్స్ మ్యాచ్ విన్నర్ రషీద్ ఖాన్‌లా రాణిస్తాడా అనేది డౌటే.

అలాగే టీమిండియాకు దూరమైన భువనేశ్వర్ కుమార్, నటరాజన్ ఫామ్‌పై కూడా అనుమానాలు నెలకొన్నాయి. గత సీజన్‌లో వీరిద్దరూ నిరాశపరిచారు. అటు ఉమ్రాన్ మాలిక్ తన పేస్ వేగంతో అదరగొడుతున్న భారీగా పరుగులివ్వడం టెన్షన్ పెడుతోంది. ఇక జట్టులో టీమిండియా స్టార్ ప్లేయర్స్ ఎవరూ లేకపోవడం కూడా సన్‌రైజర్స్ వీక్ పాయింట్. మొత్తం మీద వేలం తర్వాత జట్టులో ఎక్కువ మార్పులు చేసిన సన్ రైజర్స్ ప్రధాన కోచ్ గా బ్రయాన్ లారాను నియమించింది. అలాగే ఫాస్ట్ బౌలింగ్ కోచ్ గా డేల్ స్టెయిన్ , స్పిన్ బౌలింగ్ కోచ్ గా మురళీధరన్ లను తీసుకుంది. ఎప్పటిలానే ఈ సారి కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై అంచనాలు బాగానే ఉన్నాయి. సీనియర్ , యువ ఆటగాళ్ళ కూర్పుతో సన్ రైజర్స్ ఎలాంటి ప్రదర్శన కనబరుస్తుందో వేచి చూడాలి.

Also Read:  Starcrete on Mars: త్వరలో అంగారకుడిపై ఇల్లు? “స్టార్‌ క్రీట్” మెటీరియల్ రెడీ.. విశేషాలివీ..