Virat Kohli: పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ వెస్టిండీస్ పై చెలరేగుతాడా

టీమిండియా బ్యాటర్ విరాట్ కోహ్లీ రికార్డులు సాధించడం కొత్తేమీ కాదు.

  • Written By:
  • Updated On - July 12, 2023 / 01:21 PM IST

టీమిండియా బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) రికార్డులు సాధించడం కొత్తేమీ కాదు. ఈ నేపథ్యంలో రెండుమ్యాచ్ ల టెస్టు సిరీస్ లో భారత దిగ్గజబ్యాటర్ విరాట్ కొహ్లీని మూడు సరికొత్త రికార్డులు ఊరిస్తున్నాయి. డోమనికా రిపబ్లిక్ లోని రోసో విండ్సర్ పార్క్ వేదికగా ఈరోజు వెస్టిండీస్ తో ప్రారంభంకానున్న రెండుమ్యాచ్ ల ఐసీసీ టెస్టు లీగ్ సిరీస్ విరాట్ కొహ్లీ సరికొత్త రికార్డులకు వేదికగా నిలువనుంది. సాంప్రదాయ టెస్టు క్రికెట్లో గత మూడేళ్ల కాలంలో అంతంత మాత్రంగా రాణిస్తున్న విరాట్ కొహ్లీ తిరిగి పూర్తిస్థాయిలో పుంజుకోడానికి విండీస్ తో సిరీస్ వేదిక కానుంది.

వెస్టిండీస్ పర్యటనలో భాగంగా జరిగే రెండుమ్యాచ్ ల టెస్టు సిరీస్ తో పాటు మూడుమ్యాచ్ ల వన్డే సిరీస్ లో సైతం భారత్ తరపున విరాట్ పాల్గోనున్నాడు. భారత క్రికెట్ పరుగులయంత్రం విరాట్ కొహ్లీ గత 25 టెస్టుల్లో ఒక్క సెంచరీ మాత్రమే సాధించడం చర్చనీయాంశంగా మారింది. విరాట్ బ్యాటింగ్ లో వాడివేడీ తగ్గిపోయాయన్న విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి.

ఓవల్ వేదికగా ఆస్ట్ర్రేలియాతో ముగిసిన టెస్టు లీగ్ టైటిల్ సమరం రెండు ఇన్నింగ్స్ లోనూ విరాట్ దారుణంగా విఫలమయ్యాడు. తనదైన శైలిలో బ్యాట్ ఝళిపించలేకపోయాడు. వెస్టిండీస్ ప్రత్యర్థిగా గతంలో పలు అరుదైన రికార్డులు నెలకొల్పిన విరాట్..ప్రస్తుత రెండుమ్యాచ్ ల సిరీస్ లో సైతం స్థాయికి తగ్గట్టుగా బ్యాటింగ్ చేయగలిగితే మరో మూడు సరికొత్త రికార్డులు నెలకొల్పే అవకాశాలు కనిపిస్తున్నాయి.