1st T20I Weather Report: తొలి టీ ట్వంటీకి వరుణ గండం

కరేబియన్ టూర్‌లో టీ ట్వంటీ మజాకు అంతా సిద్ధమైంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌కు ఇవాల్టి నుంచే తెరలేవనుంది. అయితే తొలి మ్యాచ్‌కు ముందే అభిమానులను అక్కడి వాతావరణం టెన్షన్ పెడుతోంది.

  • Written By:
  • Publish Date - July 29, 2022 / 02:54 PM IST

కరేబియన్ టూర్‌లో టీ ట్వంటీ మజాకు అంతా సిద్ధమైంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌కు ఇవాల్టి నుంచే తెరలేవనుంది. అయితే తొలి మ్యాచ్‌కు ముందే అభిమానులను అక్కడి వాతావరణం టెన్షన్ పెడుతోంది. పూర్తి మ్యాచ్‌ను ఆస్వాదించే అవకాశాలు తక్కువగానే ఉన్నట్టు సమాచారం. తొలి మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది. వన్డే సిరీస్‌లో చివరి మ్యాచ్‌కు వర్షం పలుమార్లు అంతరాయం కలిగించడంతో ఓవర్లను కుదించి డక్‌వర్త్ లూయిస్ పద్దతిన మ్యాచ్ నిర్వహించారు. దీంతో తొలి టీ ట్వంటీలో కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశముంది. 52 శాతం వర్షం ప్రెడిక్షన్ ఉండగా…కనీసం ఒక గంట పాటు వాన దంచికొట్టనుంది. ఇదే జరిగితే ఆట ఆలస్యంగానైనా ప్రారంభం కావచ్చు. లేదా ఓవర్లు కుదించాల్సి రావచ్చు.

అప్పుడు డక్‌వర్త్ లూయిస్ పద్దతి జట్లకు సవాల్ కానుంది. ఇక బ్రియాన్ లారా స్టేడియంలోని పిచ్ టీ ట్వంటీ ఫార్మాట్‌కు సరిగ్గా సరిపోతుంది. ఇక్కడ ఇప్పటి వరకు కరేబియన్ ప్రీమియర్ లీగ్, మహిళల అంతర్జాతీయ మ్యాచ్‌లే జరిగాయి. పురుషుల అంతర్జాతీయ మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తుండం మాత్రం ఇదే తొలిసారి. పిచ్ పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ జరిగిన మ్యాచ్‌లలో చేజ్ చేసిన జట్లే ఎక్కువగా విజయాన్నందుకున్నాయి. దీంతో టాస్ గెలిచిన జట్లు ఫీల్డింగ్‌కు మొగ్గు చూపవచ్చు. ఇవాల్టి మ్యాచ్‌లోనూ వరుణుడు అడ్డుపడే అవకాశం ఉండడంతో డక్‌వర్త్ లూయీస్ విధానం కీలకం కానుంది. భారత్ పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగుతుండగా.. అటు విండీస్ కూడా బలంగానే ఉంది. టీ ట్వంటీ స్పెషలిస్ట్‌లతో పాటు హార్డ్‌ హిట్టర్లతో కూడిన ఈ జట్టు ఇటీవలే బంగ్లాదేశ్‌పై సిరీస్‌ గెలిచింది. ఇప్పుడు అదే జట్టుతో బరిలోకి దిగి భారత్‌పైనా రివేంజ్ కోసం సిద్ధమైంది. టీ ట్వంటీ ఫార్మేట్‌ అంటే రెచ్చిపోయే విండీస్‌ను తేలిగ్గా తీసుకుంటే రోహిత్‌సేనకు ఇబ్బందులు తప్పవు.