Site icon HashtagU Telugu

WC 2022: భారత్, పాక్ మ్యాచ్ కు వరుణ గండం

Babar Azam

Rohit and Babar Azam

ధనాధన్ క్రికెట్ సందడి మొదలైపోయింది. క్వాలిఫైయింగ్ టోర్నీలో కొన్ని జట్లు.. వార్మప్ మ్యాచ్ లతో మరికొన్ని జట్లూ బిజీగా ఉన్నాయి. అయితే టీ ట్వంటీ ప్రపంచకప్ లో అందరినీ ఆకర్షిస్తున్న మ్యాచ్ ఏదైనా ఉందంటే అది భారత్, పాక్ పోరేనని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మెల్ బోర్న్ స్టేడియం వేదికగా వచ్చే ఆదివారం ఈ మెగా ఫైట్ జరగబోతోంది.

రెండు జట్లూ ఈ మ్యాచ్ తోనే తమ వరల్డ్ కప్ క్యాంపెయిన్ ను ప్రారంభించనున్నాయి. అయితే భారత్, పాక్ మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం కనిపిస్తోంది. మెల్ బోర్న్ వాతావరణ శాఖ రిపోర్ట్ ప్రకారం అక్టోబర్ 23న భారీ వర్షం పడే అవకాశముందని తెలుస్తోంది. ఉదయం, సాయంత్రం భారీ వర్షం కురుస్తుందని అంచనా వేసింది. ఓవరాల్ గా వచ్చే వారంలో ఆస్ట్రేలియాలోని పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన ఉంది. దీంతో భారత్ , పాక్ అభిమానులు టెన్షన్ పడుతున్నారు.

చాలా రోజులుగా చిరకాల ప్రత్యర్థుల మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వరుణుడు అడ్డుపడకూడదని ప్రార్థిస్తున్నారు. మెల్ బోర్న్ స్టేడియంలో జరిగే ఈ మెగా క్లాష్ కు సంబంధించిన టిక్కెట్లన్నీ నిమిషాల్లోనే అమ్ముడైపోయాయి. భారత్, పాక్ మ్యాచ్ అంటే ఫైనల్ కంటే ఎక్కువ క్రేజ్ ఉంటుందన్నది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గత టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఓటమికి రోహిత్ సేన రివేంజ్ తీర్చుకుంటుందని భారత ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.