Semi Final: సెమీస్ పోరులో టీమిండియాపై న్యూజిలాండ్ పైచేయి సాధించేనా?

ప్రపంచకప్ విషయానికొస్తే.. ఈ మెగా టోర్నీలో ఇరు జట్లు తొమ్మిదిసార్లు తలపడగా.. న్యూజిలాండ్ 4, భారత్ 5 మ్యాచ్ ల్లో విజయం సాధించాయి.

  • Written By:
  • Publish Date - November 14, 2023 / 01:45 PM IST

Semi Final: ప్రస్తుతం ప్రపంచ కప్ లో వరుసగా తొమ్మిది విజయాలు సాధించి, లీగ్ దశలో అజేయంగా నిలిచిన భారత్ బుధవారం జరిగే తొలి సెమీఫైనల్‌లో న్యూజిలాండ్‌తో తలపడనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగనున్నాయి. ప్రస్తుత ప్రపంచకప్‌లో ఇప్పటికే ఒకసారి (లీగ్ దశలో) న్యూజిలాండ్‌ను మట్టికరిపించిన భారత్.. మరో విజయం కోసం ఉవ్విళ్లూరుతోంది. ప్రస్తుత ప్రపంచకప్‌లో భారత్ చేతిలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని కివీస్ కూడా పట్టుదలతో ఉంది.

భారత్-న్యూజిలాండ్ మ్యాచ్‌కు వేదికైన వాంఖడే మైదానం  ఎప్పుడూ బ్యాటింగ్‌కు అనువుగా ఉంటుంది. రేపటి సెమీస్ మ్యాచ్ లోనూ పరుగుల వరద పారుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. స్టేడియం చిన్నది కావడంతో బ్యాట్స్‌మెన్ ముందుగా ఫోర్లు, సిక్సర్లు కొట్టగలరు. ఈ పిచ్‌పై మరోసారి భారీ స్కోరు నమోదు కావడం ఖాయం. ఇదే పిచ్‌పై శ్రీలంకతో జరిగిన లీగ్ దశలో భారత్ బ్యాట్స్‌మెన్ చెలరేగిపోయారు. ఆ మ్యాచ్‌లో భారత్ 357 పరుగులు చేసి శ్రీలంకను 55 పరుగులకే ఆలౌట్ చేసింది. ఫలితంగా 302 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో టాస్ కీలక పాత్ర పోషించనుంది. వాంఖడే పిచ్ ముందుగా బ్యాటింగ్ చేసే జట్టుకు పూర్తిగా అనుకూలం కావడంతో టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకోవాలి. గతంలో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ల్లో విజయాలు, వైఫల్యాలను పరిశీలిస్తే న్యూజిలాండ్‌పై భారత్‌కు స్వల్ప ఆధిక్యం ఉంది. ఈ రెండు జట్లు గతంలో 117 సార్లు తలపడగా, భారత్ 59, న్యూజిలాండ్ 50 మ్యాచ్‌లు గెలిచాయి. ఒక మ్యాచ్ టై కాగా, ఏడు మ్యాచ్‌లు స్పష్టమైన ఫలితం లేకుండా ముగిశాయి.

ప్రపంచకప్ విషయానికొస్తే.. ఈ మెగా టోర్నీలో ఇరు జట్లు తొమ్మిదిసార్లు తలపడగా.. న్యూజిలాండ్ 4, భారత్ 5 మ్యాచ్ ల్లో విజయం సాధించాయి. ప్రపంచకప్ సెమీఫైనల్లో భారత్, న్యూజిలాండ్ జట్లు వరుసగా రెండోసారి తలపడుతున్నాయి. 2019 లో ఈ రెండు జట్లు తొలిసారి సెమీఫైనల్‌లో తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 21 పరుగుల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. దీంతో భారత్ కీవిస్ ను ఓడించాలని గట్టిగా నిర్ణయించుకుంది.