Site icon HashtagU Telugu

Cameron Green: కామెరూన్ గ్రీన్ ఐపీఎల్ ఆడతాడా ?

Cameron Green IPL

Cameron Green IPL

ఐపీఎల్ వేలంలో జాక్ పాట్ కొట్టిన ఆసీస్ ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ సందర్భంగా గాయపడ్డాడు. రెండో టెస్టులో అతని వేలికి గాయమైంది. దీంతో మూడో మ్యాచ్ కు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో అతను ఐపీఎల్ సీజన్ కు అందుబాటులో ఉంటాడా అనేది సందిగ్ధంగా మారింది. ఫార్మాట్ తో సంబంధం లేకుండా గత కొంత కాలంగా నిలకడగా రాణిస్తున్న కామెరూన్ గ్రీన్ ను ఇటీవల ముగిసిన మినీ వేలంలో ముంబై ఇండియన్స్ 17.5 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ఆల్ రౌండరే అయినప్పటకీ ఈ స్థాయి ధర పలుకుతుందని ఎవ్వరూ ఊహించలేదు. దీంతో ఒక్కసారిగా పాపులర్ అయిపోయాడు. ప్రస్తుతం సౌతాఫ్రికాతో సొంతగడ్డపై జరుగుతున్న టెస్ట్ సిరీస్ లోనూ అదరగొడుతున్నాడు. అయితే రెండో టెస్టులో గాయపడడంతో సిరీస్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీసిన గ్రీన్ బ్యాట్ తో రాణించి హాఫ్ సెంచరీ చేశాడు. దురదృష్టవశాత్తూ మిగిలిన మ్యాచ్ కు దూరమవడంతో అతన్ని కొన్న ముంబై ఇండియన్స్ ఆందోళన చెందుతోంది. ప్రస్తుతం కామెరూన్ గ్రీన్ గాయం తీవ్రతపై పూర్తి స్పష్టత లేదు. ఐపీఎల్ కు ఇంకా మూడు నెలల సమయం ఉన్నప్పటకీ పూర్తి ఫిట్ నెస్ సాధించకుంటే ఆసీస్ క్రికెట్ బోర్డు అతన్ని ఐపీఎల్ లో అనుమతించే అవకాశం ఉండదు. దీంతో భారీ ధర పెట్టి కొనుగోలు చేసిన ఆల్ రౌండర్ త్వరగా కోలుకోవాలని ముంబై ఫ్రాంచైజీ కోరుకుంటోంది. ఇదిలా ఉంటే ఐపీఎల్ కంటే ముందు భారత్ తో జరిగే నాలుగు టెస్టుల సిరీస్ ఆడాలని గ్రీన్ పట్టుదలగా ఉన్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం అద్భుతంగా ఉందని, గాయం కారణంగా దానిని తాను కోల్పోవడం బాధగా ఉందన్నాడు. భారత్ తో జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్ సమయానికి తాను కోలుకునేందుకు ప్రయత్నిస్తానని చెప్పాడు.