Site icon HashtagU Telugu

Rohit Sharma: కోలుకుంటున్న హిట్ మ్యాన్

Rohit Sharma To Open

Rohit Sharma To Open

వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ ట్వంటీ మధ్యలోనే భారత కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. 5 బంతుల్లో 11 పరుగులు చేసి జోరుమీదున్న హిట్ మ్యాన్ అకస్మాత్తుగా మైదానాన్ని వీడటం చూసిన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. అతడికి ఏమైందా అంటూ నెట్టింట చర్చ మొదలు పెట్టేశారు. అయితే ఈ విషయంపై బీసీసీఐ అప్డేట్ ఇచ్చింది.

రోహిత్‌కు నడుముకు వెనుక భాగంలో గాయమైందని బీసీసీఐ స్పష్టతనిచ్చింది. అతడి పరిస్థితిని ఎప్పటికప్పుడు బీసీసీఐ వైద్య సిబ్బంది పర్యవేక్షిస్తోందని బీసీసీఐ తన ట్విటర్ వేదికగా వెల్లడించింది. విండీస్ బౌలర్ అల్జారీ జోసెఫ్ వేసిన రెండో ఓవర్ నాలుగో బంతికి హిట్ మ్యాన్ పరుగులేమి చేయలేదు. ఆ తర్వాత ఒక్కసారిగా నడుముపై చేతులు పెట్టుకుని ఇబ్బంది పడ్డాడు. దీంతో ఫిజియో వచ్చి ప్రాథమిక చికిత్స ఇచ్చినప్పటికీ నొప్పి తగ్గకపోవడంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు.

అనంతరం శ్రేయాస్ అయ్యర్ మైదానంలోకి అడుగుపెట్టాడు.ఈ గాయం కారణంగా అతడు పూర్తి సిరీస్‌కు దూరమవుతాడా లేదా వచ్చే గేమ్‌కు అందుబాటులో ఉంటాడా అనేది అనుమానంగా మారింది. హిట్ మ్యాన్‌కు నడుము గాయమైందని, ప్రస్తుతం నిలకడగానే ఉన్నాడని చెప్పిన బీసీసీఐ అతను ఎప్పుడూ కోలుకుంటాడనేది క్లారిటీగా చెప్పలేదు. తర్వాతి మ్యాచ్‌కు కాస్త గ్యాప్ ఉండటంతో ఆ లోపు కోలుకుంటాడని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రోహిత్ శర్మ లేకున్నప్పటికీ టీమిండియా 165 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి ఓ ఓవర్ మిగిలుండానే ఛేదించింది. సూర్యకుమార్ యాదవ్ అర్ధశతకంతో అదరగొట్టగా.. రిషభ్ పంత్ చివర్లో మెరుపులు మెరిపించాడు. ప్రస్తుతం సీరీస్ లో భారత్ 2-1 ఆధిక్యంలో ఉండగా…నాలుగో మ్యాచ్ శనివారం జరగనుంది.