క్రిస్ గేల్… ప్రపంచ క్రికెట్ లో పరిచయం అవసరం లేని పేరు…క్రీజులోకి వచ్చాడంటే ప్రత్యర్థి బౌలర్లకు పట్టపగలే చుక్కలు కనిపిస్తాయి.. ఏ బౌలర్ అయినా.. ఫార్మేట్ ఏదైనా బంతిని బౌండరీ అవతలకు పంపించడమే అతనికి తెలిసిన విద్య. గేల్ బ్యాటింగ్ కు దిగ్గజ బౌలర్లు సైతం బలైన సందర్భాల్లో ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా టీ ట్వంటీ ఫార్మేట్ లో ఈ జమైకా వీరుడి విధ్వంసానికి హద్దే లేదు. ఐపీఎల్ నుండి పలు విదేశీ లీగ్స్ లో పరుగుల వరద పారించాడు. అయితే గత కొన్నేళ్ళుగా గేల్ ఆట మునుపటిలా లేదు. దీంతో ఐపీఎల్ వేలంలోనూ అతనికి బేస్ ప్రైస్ రావడం కూడా కష్టంగా మారింది. గత రికార్డుల కంటే ప్రస్తుత ఫామ్ చూసుకునే ఫ్రాంచైజీలు గేల్ పై గత ఏడాది వేలంలో అసలు ఆసక్తి చూపించలేదు. వేలంలో రెండు రౌండ్లలో అమ్ముడవకపోగా.. చివరి రౌండ్ లో పంజాబ్ కింగ్స్ గేల్ ను అతని కనీస ధర 2 కోట్లకు దక్కించుకుంది.
ఈ సారి జరగనున్న మెగా వేలంలో అసలు గేల్ అమ్ముడవడం కష్టమేనని విశ్లేషకులు ఇప్పటికే అంచనా వేశారు. దీనిని పరిగణలోకి తీసుకున్నాడో లేకా మరో కారణమో 2022 ఐపీఎల్ వేలానికి గేల్ దూరమయ్యాడు. ఆటగాళ్ళ జాబితాలో తన పేరు రిజిస్టర్ చేసుకోలేదు. దీంతో గేల్ ఐపీఎల్ కెరీర్ కూడా ముగిసినట్టే కనిపిస్తోంది. తనకు తాను యూనివర్స్ బాస్ గా చెప్పుకునే ఈ విండీస్ వీరుడు ఇప్పటి వరకూ 14 ఐపీఎల్ సీజన్లలో మూడు జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. తొలుత కోల్ కతా నైట్ రైడర్స్ కు ఆడిన గేల్ ను తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దక్కించుకుంది. గత సీజన్ వరకూ పంజాబ్ కింగ్స్ కు ప్రాతినిథ్యం వహించిన గేల్ ఇప్పటి వరకూ 142 మ్యాచ్ లలో 148 స్ట్రైక్ రేట్ తో 4965 పరుగులు చేశాడు. ఇప్పటి వరకూ ఐపీఎల్ ద్వారా 58.65 కోట్లు ఆర్జించాడు.
తొలి సీజన్ లో 3.2 కోట్ల రూపాయలకు అమ్ముడైన క్రిస్ గేల్ ధర ప్రతీ సీజన్ కూ పెరుగుతూనే వచ్చింది. 2014 నుండి 2017 వరకూ నాలుగు సీజన్లకు సంబంధించి రాయల్ ఛాలెంజర్స్ గేల్ కోసం 7.5 కోట్ల రూపాయలు వెచ్చించింది. అయితే తర్వాత ఫామ్ కోల్పోవడం, అంచనాలకు తగ్గటు రాణించకపోవడంతో గేల్ కనీస ధరకే పరిమితమయ్యాడు. ఆర్సీబీ అతన్ని వేలంలోకి వదిలేసిన తర్వాత పంజాబ్ ఫ్రాంచైజీ 2018 నుండీ 2 కోట్ల ధరకే వేలంలో కొనుగోలు చేస్తూ వచ్చింది. అటు జాతీయ జట్టులో ఆడేందుకూ ఆసక్తి చూపించని గేల్ కేవలం విదేశీ క్రికెట్ లీగ్స్ కే పరిమితమయ్యాడు. ఇక గత ఏడాది టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఆడినప్పుడే రిటైర్మెంట్ పై పరోక్ష సంకేతాలిచ్చాడు. దీంతో వేలంపై ఓ అంచనాకు వచ్చేసిన గేల్ ముందుగానే తప్పుకున్నాడన్న అభిప్రాయం వినిపిస్తోంది.