IPL 2024: కమ్మిన్స్ కే కెప్టెన్సీ ఎందుకు ? సన్ రైజర్స్ లాజిక్ ఇదే

ఐపీఎల్ 2024 సీజన్‌కు సన్ రైజర్స్ హైదరాబాద్ కొత్త కెప్టెన్‌గా ప్యాట్ కమ్మిన్స్ ను నియమిస్తూ ఆ ఫ్రాంచైజీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. మార్క్ రమ్ స్థానంలో జట్టు పగ్గాలు అందుకోనున్న కమ్మిన్స్ పై అంచనాలు భారీగానే ఉన్నాయి.

IPL 2024: ఐపీఎల్ 2024 సీజన్‌కు సన్ రైజర్స్ హైదరాబాద్ కొత్త కెప్టెన్‌గా ప్యాట్ కమ్మిన్స్ ను నియమిస్తూ ఆ ఫ్రాంచైజీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. మార్క్ రమ్ స్థానంలో జట్టు పగ్గాలు అందుకోనున్న కమ్మిన్స్ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. అసలు ఈ ఆసీస్ పేసర్ కే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడానికి కారణమేంటనే దానిపై చర్చ జరుగుతోంది. బౌలింగ్, బ్యాటింగ్‌తో పాటు నాయకత్వ లక్షణాలు సమర్థవంతంగా నిర్వహించే కమిన్స్ కోసం ఐపీఎల్ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో తీవ్రంగా పోటీపడింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో పాటు ఇతర జట్లు పోటీగా వచ్చినా అంతిమంగా రికార్డు ధరతో అతడ్ని సన్‌రైజర్స్ సొంతం చేసుకుంది. కమిన్స్ కోసం ఏకంగా రూ.20.50 కోట్లు కుమ్మరించింది.

అతనికే కెప్టెన్సీ ఇవ్వడానికి చాలా కారణాలే ఉన్నాయి. గతేడాది కమిన్స్ పట్టిందల్లా బంగారంలా మారింది. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్, వన్డే వరల్డ్ కప్‌లను గెలిచిన కెప్టెన్‌గా కమిన్స్ నిలిచాడు. ఆ రెండు ఫైనల్లోనూ భారత్‌పైనే ఆస్ట్రేలియాను గెలుపు బాటలో నడిపించాడు. అంతేగాక కెప్టెన్‌గా యాషెస్ సిరీస్‌ను కాపాడుకున్నాడు. క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా, ఐసీసీ టెస్టు జట్టు సారథిగా కూడా కమిన్స్ ఎంపికయ్యాడు. వీటితో పాటు మరో ప్రత్యేక సెంటిమెంట్‌తో కమిన్స్‌ను సన్‌రైజర్స్ కెప్టెన్‌గా నియమించిందని నెట్టింట్లో చర్చ మొదలైంది. హైదరాబాద్ ఫ్రాంచైజీకి ఇప్పటివరకు రెండు టైటిళ్లు దక్కాయి. 2009లో డెక్కన్ ఛార్జర్స్‌‌గా, 2016లో సన్‌రైజర్స్‌గా హైదరాబాద్ ఛాంపియన్‌గా నిలిచింది. అయితే ఆ రెండు సందర్భాల్లోనూ కెప్టెన్లు ఆస్ట్రేలియా ఆటగాళ్లే. 2009లో ఆడమ్ గిల్‌క్రిస్ట్, 2016లో డేవిడ్ వార్నర్ జట్టును నడిపించారు. కాగా, అదే మ్యాజిక్‌ను ఇప్పుడు రిపీట్ చేయాలనే సెంటిమెంట్‌తోనూ ఆస్ట్రేలియా ప్లేయర్ సారథి బాధ్యతలు కట్టబెట్టారని పలువురు చెబుతున్నారు. కారణాలు ఏమైనప్పటికీ కమిన్స్ ఉత్తమ సారథి అని ఎస్‌ఆర్‌హెచ్ నిర్ణయానికి ఫ్యాన్స్ మద్దతు ఇస్తున్నారు.

Also Read: Muthu Song : ‘ముత్తు’ పాటను పాడుతూ జపాన్ పెద్దాయన డ్యాన్స్.. వీడియో వైరల్