PV Sindhu: జాతీయ క్రీడ‌ల‌కు పీవీ సింధు దూరం.. కార‌ణ‌మిదే..?

భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఇటీవల జరిగిన బర్మింగ్‌హ‌మ్‌ కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన విషయం తెలిసిందే.

  • Written By:
  • Publish Date - September 25, 2022 / 11:38 AM IST

భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఇటీవల జరిగిన బర్మింగ్‌హ‌మ్‌ కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన విషయం తెలిసిందే. కామన్‌వెల్త్‌ పోటీల్లో తొలిసారిగా పసిడి సాధించిన సింధు.. తన తదుపరి లక్ష్యాలపై దృష్టి పెట్టింది. తాజాగా ఆమె అభిమానులను షాక్‌కు గురిచేసింది. గాయం కారణంగా జాతీయ క్రీడ‌ల‌కు దూరం కానుంది. ఈ విష‌యాన్ని సోషల్ మీడియా వేదికగా సింధు తెలియజేసింది.

ఒలింపిక్ క్రీడల‌లో రెండు సార్లు ప‌తకాలు సాధించిన స్టార్ ష‌ట్ల‌ర్‌ పీవీ సింధు 36వ జాతీయ క్రీడ‌ల‌కు దూరం కానుంది. ఈ జాతీయ క్రీడ‌లు అహ్మదాబాద్‌లో సెప్టెంబర్ 29న ప్రారంభం కానున్నాయి. ఈ క్రీడ‌ల‌కు దూర‌మైన సింధు జాతీయ క్రీడ‌ల ఆరంభ వేడుక‌ల్లో మాత్రం పాల్గొన‌నుంది. గాయం కార‌ణంగా ఈ క్రీడ‌ల్లో పాల్గొన‌డం లేద‌ని పేర్కొంది.

కామ‌న్‌వెల్త్ క్రీడ‌ల స‌మ‌యంలో సింధు గాయ‌ప‌డిన విష‌యం తెలిసిందే. మ‌డ‌మ గాయం నుంచి పూర్తిగా కోలుకోక‌పోవ‌డంతో జాతీయ క్రీడ‌ల నుంచి త‌ప్పుకోవాల‌ని సింధు నిర్ణ‌యించుకుంది. ప్ర‌స్తుతం త‌న దృష్టి అంతా ఆసియా క్రీడ‌లు, పారిస్ ఒలింపిక్స్‌పైనే ఉన్న‌ట్లు ఆమె స్ప‌ష్టం చేసింది.

2016 రియో ​​గేమ్స్‌లో రజతం, గ‌తేడాది టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలుచుకున్న సింధు.. వచ్చే ఏడాది ఆసియా క్రీడలు, ఒలింపిక్ క్వాలిఫైయింగ్‌కు ముందు తన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికే ఈ క్రీడల నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు సింధు చెప్పింది. గాయం కార‌ణంగా ఇటీవల జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కూడా సింధు పాల్గొన‌లేదు. సింధుకు మ‌రింత విశ్రాంతి అవ‌స‌ర‌మ‌ని వైద్యులు సూచించారు. దీంతో.. జాతీయ క్రీడ‌ల‌కు దూర‌మైన‌ట్లు సింధు పేర్కొంది.