Mukesh Ambani IPL: ముకేశ్ జీ.. ఐపీఎల్ డిజిటల్ మీడియా హక్కులు దక్కించుకున్న స్ట్రాటజీ !!

ముకేశ్ అంబానీ అపర కుబేరుడు.. ఇండియాలోనే రిచెస్ట్ పర్సన్.. జియో టెలికాం నెట్ వర్క్ ద్వారా దేశంలో డిజిటల్ మీడియా వినియోగ విప్లవానికి తెర తీసిన ఆద్యుడు.

  • Written By:
  • Publish Date - June 18, 2022 / 06:44 AM IST

ముకేశ్ అంబానీ అపర కుబేరుడు.. ఇండియాలోనే రిచెస్ట్ పర్సన్.. జియో టెలికాం నెట్ వర్క్ ద్వారా దేశంలో డిజిటల్ మీడియా వినియోగ విప్లవానికి తెర తీసిన ఆద్యుడు. తాజాగా ఆయన మరో సంచలనం సృష్టించారు. రూ.24 వేల కోట్లతో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ ల డిజిటల్ మీడియా హక్కులను దక్కించుకున్నారు. ముకేశ్ అంబానీ ఎక్కడ ఎంటర్ అయితే అక్కడ సీన్ మారిపోతుంది. ఈసారి ఐపీఎల్ వేలంలోనూ సీన్ మారింది. గతం కంటే పూర్తి విభిన్నంగా ఈసారి ఐపీఎల్ టీవీ ప్రసార హక్కుల కంటే.. డిజిటల్ మీడియా హక్కులకే వేలంలో ఎక్కువ రేటు పలికింది. కారణం ..ఐపీఎల్ డిజిటల్ మీడియా హక్కులను ముకేశ్ అంబానీకి చెందిన “వయకమ్18 మీడియా” దక్కించుకోవడం!! వాస్తవానికి బీసీసీఐ నిర్వహించిన వేలంలోని టీవీ, డిజిటల్ రెండు కేటగిరీల్లోనూ “వయకమ్18 మీడియా” పాల్గొంది.

టీవీ హక్కుల కోసం కూడా..

టీవీ మీడియా హక్కుల కోసం కూడా ముకేశ్ అంబానీకి చెందిన “వయకమ్18 మీడియా” కంపెనీ
చివరి నిమిషం దాకా వేలంలో బిడ్లు దాఖలు చేసింది. హాట్ స్టార్ యాజమాన్య సంస్థ “వాల్ట్ డిస్నీ”కి ఎంతో పోటీని ఇచ్చింది.
చివరికి వాల్ట్ డిస్నీ కంపెనీకి ఐపీఎల్ ప్రసార హక్కులు రూ.23,400 కోట్లకు దక్కాయి. టీవీ హక్కులను పొందలేకపోయినా.. తొలిసారిగా డిజిటల్ మీడియా హక్కులను సొంతం చేసుకునే అవకాశాన్ని “వయకమ్18 మీడియా” దక్కించుకుంది. టీవీ హక్కుల బిడ్డింగ్ లో “వయకమ్18 మీడియా” ముందస్తు వ్యూహం ప్రకారమే చివరి నిమిషంలో వెనక్కి తగ్గిందనే విశ్లేషణలు వెలువడుతున్నాయి.

చాలా దేశాల్లో ఇప్పటికే..

చాలా దేశాల్లో ఇప్పటికే సాకర్, బ్యాడ్మింటన్, టెన్నిస్, బాస్కెట్ బాల్ కు సంబంధించిన పలు టోర్నమెంట్ల మీడియా హక్కులను “వయకమ్18 మీడియా” సొంతం చేసుకుంది. ఇప్పుడు క్రికెట్ పైనా ఆ కంపెనీ దృష్టి పెట్టింది. కంపెనీ పరిధిలోని జియో, ఊట్ సహా పలు డిజిటల్ ప్లాట్ ఫామ్ల బలోపేతం పై కసరత్తు చేస్తోంది. ఐపీఎల్ డిజిటల్ మీడియా హక్కులను “వయ కమ్18 మీడియా” సొంతం చేసుకోవడం.. దాని డిజిటల్ విస్తరణ ప్రణాళికలకు దన్నుగా నిలువనుంది. ఈ ఏడాది చివరికల్లా భారత్ లో 5జీ ఇంటర్నెట్ సేవలు మొదలుకానున్నాయి. దీన్ని ఒక అతిపెద్ద వ్యాపార అవకాశంగా జియో భావిస్తున్నట్లు తెలుస్తోంది.

మరో 90 కోట్ల మందికి ఇంటర్నెట్..

ప్రపంచ వ్యాప్తంగా వచ్చే ఐదేళ్లలో కొత్తగా మరో 90 కోట్ల మందికి ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కరోనా లాక్ డౌన్ కాలం నుంచి డిజిటల్ మీడియా బూమ్ లో ఉంది. వచ్చే 6 నెలల్లో 5జీ దన్నుతో డిజిటల్ మీడియా వినియోగం మరింత విస్తరించే అవకాశాలు ముమ్మరంగా ఉన్నాయి. ఇప్పటికే డిజిటల్ మీడియాలో ఎన్నో రూపాల్లో పాతుకుపోయిన ముకేశ్ అంబానీ రిలయన్స్ గ్రూప్ .. ఈ మార్పును తన వికాసానికి అదునుగా మార్చుకోనుంది. భవిష్యత్ లో చోటుచేసుకోనున్న పరిణామాలను ముందుచూపుతో అంచనా వేసినందు వల్లే.. ఐపీఎల్ డిజిటల్ మీడియా హక్కులను అంత భారీ ధరకు ముకేశ్ దక్కించుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రానున్న రిలయన్స్ గ్రూప్ కు చెందిన డిజిటల్ విభాగం రిలయన్స్ జియో ఇన్ఫో కామ్ బలోపేతం పై ముకేశ్ అంబానీ ప్రత్యేక దృష్టి పెట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. టీవీ తో పోల్చుకుంటే.. డిజిటల్ మీడియా కు ప్రేక్షక ఆదరణ చాలా పెరుగుతుండటం గమనార్హం.