Site icon HashtagU Telugu

ICC Tournaments: టీమిండియాకు ఐసీసీ ఫోబియా !

ICC Tournaments

0.558262802387804

ICC Tournaments: దశాబ్దం.. టీమిండియా ఐసీసీ టైటిల్ గెలిచి అక్షరాలా పదేళ్ళు దాటిపోయింది…గత పదేళ్ళలో నాలుగుసార్లు టైటిల్ గెలిచే అవకాశం వచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయింది. తాజాగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లోనూ ఓటమితో మరోసారి ఐసీసీ టైటిల్ విజయం కోసం నిరీక్షణ కొనసాగుతూనే ఉంది. అసలు టీమిండియాకు ఏమైంది.. ఐసీసీ ఫోబియా పట్టుకుందా.. మెగా టోర్నీల్లో ఎందుకీ తడబాటు…ఇవే ఇప్పుడు అభిమానులను వేధిస్తున్న ప్రశ్నలు..

ప్రపంచ క్రికెట్‌లో అగ్రశ్రేణి జట్లలో ఒకటిగా ఉన్న భారత్‌కు గత కొంతకాలంగా ఐసీసీ టోర్నీలు కలిసిరావడం లేదు. కెప్టెన్లు మారినా.. కోచ్‌లు మారినా.. మెగా టోర్నీల్లో మాత్రం నిరాశే మిగులుతోంది. చివరిసారిగా టీమిండియా 2013లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. ఆ టోర్నీ తర్వాత మళ్ళీ మెగా టైటిల్ అందుకోలేకపోయింది. అంటే వరుసగా తొమ్మిదో టోర్నీల్లో నిరాశే మిగిలింది. చివరిసారి ధోనీ సారథ్యంలో కప్ అందుకున్న తర్వాత భారత్ 9 ఐసీసీ టోర్నీల్లో ఆడింది. వీటిలో 4 సార్లు తుది పోరుకు అర్హత సాధించింది. 2014 టీ ట్వంటీ ప్రపంచకప్ , 2017 ఛాంపియన్స్ ట్రోఫీ, 2021 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ , తాజాగా 2023 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ కు చేరినప్పటకీ తుది మెట్టుపై బోల్తా పడింది. ఫార్మేట్ ఏదైనా ఐసీసీ టోర్నీల్లో భారత జట్టు ప్రదర్శన స్థాయికి తగినట్టు లేదన్నది అంగీకరించాల్సిందే.

భారత్ ఎప్పుడు ఎక్కడ ఆడినా అంచనాలు ఎక్కువగానే ఉంటాయి. భారత్ ఫైనల్ వరకూ చేరితే స్పాన్సర్లకూ, నిర్వాహకులకూ పండుగే. దురదృష్టవశాత్తూ లీగ్ స్టేజ్ లోనే ఇంటిదారి పట్టిందంటే ఆ టోర్నీ కళ తప్పినట్టే. అయితే గత పదేళ్ళ కాలంలో పలు సార్లు టీమిండియా అంచనాలను అందుకోలేకపోయింది. 2015 వన్డే ప్రపంచకప్ లోనూ, 2016 టీ ట్వంటీ ప్రపంచకప్ , 2018 వన్డే ప్రపంచకప్ లోనూ సెమీస్ వరకే చేరుకోగలిగింది. ఇక 2021 టీ ట్వంటీ ప్రపంచకప్ లో అయితే లీగ్ స్టేజ్ కే పరిమితమైంది. దీంతో ఐసీసీ టోర్నీల్లో టైటిల్ గత పదేళ్ళుగా అందని ద్రాక్షగా మారింది. స్వదేశంలోనూ, విదేశాల్లో ద్వైపాక్షిక సిరీస్ లు, టెస్ట్ సిరీస్ గెలుస్తున్నప్పటకీ.. ఐసీసీ టోర్నీల్లో మాత్రం పేలవ ప్రదర్శన ఆశ్చర్యం కలిగిస్తోంది.

తాజాగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ దీనికి ఉదాహరణ. గత ఏడాది కాలంగా టెస్ట్ ఫార్మాట్ లో అద్భుత విజయాలు సాధిస్తూ ఫైనల్ కు చేరింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆసీస్ ను నిలువరించిన రోహిత్ సేన ఇప్పుడు అదే జట్టు చేతిలో తటస్థ వేదికపై చేతులెత్తేయడం అభిమానులకు మింగుడు పడడం లేదు. ఐపీఎల్ హ్యాంగోవర్ ఇంకా దిగలేదంటూ ట్రోలింగ్స్ కూడా మొదలయ్యాయి. నిజానికి వారం రోజుల గ్యాప్ తోనే ఈ మ్యాచ్ లో బరిలోకి దిగిన భారత్ కు పలువురు కీలక ఆటగాళ్ళు అందుబాటులో లేకపోవడం కూడా కొంపముంచింది. బూమ్రా, పంత్ , కెఎల్ రాహుల్ లాంటి ప్లేయర్స్ దూరమవడం ప్రభావం చూపింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో భారత్ ఓడిపోవడం వరుసగా ఇది రెండోసారి. 2021లో న్యూజిలాండ్ చేతిలో పరాజయం పాలైన భారత్ ను ఇప్పుడు ఆసీస్ ఓడించి టైటిల్ దూరం చేసింది. ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా 209 పరుగుల తేడాతో విజయం సాధించింది. విజయం కోసం చివరి రోజు 280 పరుగులు చేయాల్సి ఉండగా.. ఆసీస్ బౌలర్ల ధాటికి భారత్ 234 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా మరోసారి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ టైటిల్ చేరువలో బోల్తా పడింది.

Read More: WTC Final: చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ కైవసం..!

Exit mobile version