Yuvraj Singh: వైట్ బాల్ క్రికెట్‌లో టీమ్ ఇండియాకు అతిపెద్ద మ్యాచ్ విన్నర్‌గా నిలిచిన యువరాజ్ సింగ్ తన కెరీర్ చివరి దశలో ఆశించిన మద్దతు లభించకపోవడం వల్లే అందరినీ ఆశ్చర్యపరుస్తూ అకస్మాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ విషయంపై యువీ గతంలో చాలా తక్కువగా మాట్లాడారు. అయితే ఇప్పుడు టీమ్ ఇండియా ‘సిక్సర్ కింగ్’ తన రిటైర్మెంట్‌కు గల అసలు కారణాలను బయటపెట్టారు. అప్పట్లో టీమ్ ఇండియా డ్రెస్సింగ్ రూమ్ పరిస్థితులపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.
రిటైర్మెంట్‌పై యువరాజ్ సింగ్ సంచలన వెల్లడి
క్యాన్సర్‌తో బాధపడుతున్నా లెక్కచేయకుండా 2011 ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌లో ఆడి భారత్‌కు ట్రోఫీని అందించారు యువరాజ్. అంతటి ఘనత సాధించినప్పటికీ ఆయనకు కనీసం ఒక ‘ఫేర్‌వెల్ మ్యాచ్’ (వీడ్కోలు మ్యాచ్) కూడా లభించలేదు.
ఈ విషయంపై సాన్యా మీర్జా పాడ్‌కాస్ట్‌లో యువీ మాట్లాడుతూ.. నేను అప్పట్లో ఆటను ఆస్వాదించలేకపోయాను. నాకు మజా రానప్పుడు ఇంకా క్రికెట్ ఎందుకు ఆడాలి అని అనిపించింది. నాకు ఎవరి నుండీ మద్దతు లభించలేదు. కనీస గౌరవం కూడా దక్కలేదు. గౌరవం లేని చోట నేను ఉండాల్సిన అవసరం ఏముంది? నాకు ఇష్టం లేని పనిలో ఎందుకు ఇరుక్కోవాలి? నేను ఇంకా ఎవరికి ఏం నిరూపించుకోవాలి? మానసికంగా, శారీరకంగా అది నన్ను చాలా బాధించింది. ఏ రోజైతే నేను ఆడటం ఆపేశానో ఆ రోజు నుండే మళ్ళీ నేను పాత యువరాజ్‌లా మారగలిగాను అని అన్నారు.
Also Read: డబ్బు కట్ అయి, పేమెంట్ ఫెయిల్ అయితే ఏం జరుగుతుంది?
నవజ్యోత్ సింగ్ సిద్ధూ గురించి
మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ, చిన్నప్పుడు యువీ ఆటను చూసి ఇతను క్రికెటర్ అవ్వడం కష్టమని వ్యాఖ్యానించారు. ఈ మాటలను యువీ తండ్రి యోగరాజ్ సింగ్ అప్పట్లో చాలా సీరియస్‌గా తీసుకున్నారు. దీనిపై యువీ స్పందిస్తూ.. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే, సిద్ధూ గారికి నా ఆటను సరిగ్గా గమనించే సమయం లేదనిపిస్తుంది. ఆయన మా నాన్నగారితో మర్యాదగా ఉండటానికి అలా అని ఉండవచ్చు. అప్పట్లో ఆయన ఇండియా టీమ్‌కు ఆడుతున్నారు. నేను కేవలం 13-14 ఏళ్ల కుర్రాడిని, అప్పుడప్పుడే ఆటను అర్థం చేసుకుంటున్నాను. ఆ మాటలను నేను వ్యక్తిగతంగా తీసుకోలేదు. కానీ మా నాన్నగారు మాత్రం చాలా ఫీల్ అయ్యారు అని చెప్పుకొచ్చారు.
