T20I Legacy: ముగ్గురు మొనగాళ్ళు వారి స్థానాలను భర్తీ చేసేది ఎవరు ?

టీ ట్వంటీ క్రికెట్ లో ఒక శకానికి తెరపడింది. జట్టును విజయవంతంగా నడిపించిన కెప్టెన్ రోహిత్ శర్మ , ఫైనల్లో కీలక ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీ, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా పొట్టి క్రికెట్ కు గుడ్ బై చెప్పేశారు. యువక్రికెటర్లకు అవకాశమిచ్చేందుకు టీ ట్వంటీలకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ ముగ్గురు లేకుండా అసలు భారత జట్టు ఊహించడం కష్టమేనని చెప్పాలి.

T20I Legacy: భారత క్రికెట్ లో ఈ ఏడాది అభిమానులకు చారిత్రక జ్ఞాపకాన్నే ఇచ్చింది. వన్డే వరల్డ్ కప్ చేజారినా రోహిత్ సేన టీ ట్వంటీ ప్రపంచకప్ ను ముద్దాడింది. ఓటమే లేకుండా ఫైనల్ కు చేరి సఫారీలను ఓడించి రెండోసారి విశ్వవిజేతగా నిలిచింది. అయితే ఈ ప్రపంచకప్ విజయంతోనే భారత టీ ట్వంటీ క్రికెట్ లో ఒక శకానికి తెరపడింది. జట్టును విజయవంతంగా నడిపించిన కెప్టెన్ రోహిత్ శర్మ , ఫైనల్లో కీలక ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీ, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా పొట్టి క్రికెట్ కు గుడ్ బై చెప్పేశారు. యువక్రికెటర్లకు అవకాశమిచ్చేందుకు టీ ట్వంటీలకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ ముగ్గురు లేకుండా అసలు భారత జట్టు ఊహించడం కష్టమేనని చెప్పాలి.

ఎందుకంటే భారత విజయాల్లో వీరి పాత్ర అలాంటిది మరి. ఫార్మాట్ తో సంబంధం లేకుండా పరుగుల వరద పారించిన కోహ్లీ, జట్టును లీడ్ చేసిన హిట్ మ్యాన్ ఆధిపత్యం గురించి ఎంత చెప్పినా తక్కువే. నిజానికి 15 ఏళ్ళుగా భారత టీ ట్వంటీ టీమ్ లో వీరి జోరు కొనసాగుతోంది. 2022 వరల్డ్ కప్ వైఫల్యం తర్వాత టీ ట్వంటీ టీమ్ కు దూరమైనా కొన్నేళ్ళుగా జట్టు విజయాల్లో వీరి పాత్ర గురించి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ సారథిగానే కాదు ఓపెనర్ గా ఎన్నో విధ్వంసకర ఇన్నింగ్స్ లు ఆడాడు. అసలు టీ ట్వంటీ ఫార్మాట్ లో హాఫ్ సెంచరీ చేస్తే శతకం చేసినంత విలువ. అలాంటిది రోహిత్ శర్మ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు సెంచరీలు బాదాడు. 2007 తొలి టీ ట్వంటీ వరల్డ్ కప్ నుంచి తాజాగా ముగిసిన మెగా టోర్నీ వరకూ హిట్ మ్యాన్ తన రోల్ కు న్యాయం చేశాడు. కెరీర్ లో 159 టీ ట్వంటీల్లో 140 స్ట్రైక్ రేట్ తో 4 వేలకు పైగా పరుగులు సాధించాడు. అలాగే కోహ్లీ నుంచి పగ్గాలు అందుకున్న తర్వాత జట్టును సక్సెస్ ఫుల్ గా లీడ్ చేశాడు. అతని స్థానంలో టీ ట్వంటీ టీమ్ కు ఓపెనర్ గా ఎవరు సక్సెస్ అవుతారనేది చూడాలి. ఎందుకంటే ఓపెనర్ గా గిల్ , జైశ్వాల్ , సంజూ శాంసన్ వంటి యువ ఆటగాళ్ళ రూపంలో ప్రత్యామ్నాయాలు ఉన్నాయి.

మరోవైపు రికార్డుల రారాజు , కింగ్ కోహ్లీ బ్యాటింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏ ఫార్మాట్ అయినా నిలకడగా రాణించడం అతనికి మాత్రమే సొంతం. మధ్యలో పేలవ ఫామ్ తో సతమతమైనా తర్వాత పుంజుకోవడం ఎన్నోసార్లు చూశాం. అన్నింటికీ మించి వన్ డౌన్ భారీ స్కోరును అందించే ఆటగాడిగా విరాట్ కు గుర్తింపు ఉంది. రోహిత్ లానే 2022 తర్వాత టీ ట్వంటీలకు దూరంగా ఉన్నప్పటికీ వరల్డ్ కప్ కోసం రీఎంట్రీ ఇచ్చాడు. ఇక టోర్నీలో ఓపెనర్ గా కోహ్లీ సక్సెస్ కాలేకపోయినా ఫైనల్లో మాత్రం కీలక ఇన్నింగ్స్ ఆడాడు. రోహిత్ కంటే మూడేళ్ళ తర్వాత అంతర్జాతీయ అరంగేట్రం చేసిన విరాట్ ఇప్పటి వరకూ 125 మ్యాచ్ లలో 137 స్ట్రైక్ రేట్ తో 4 వేలకు పైగా పరుగులు చేశాడు. టీ ట్వంటీ ఫార్మాట్ లోనూ ఎన్నో రికార్డులు అందుకున్నాడు. టాపార్డర్ లో నమ్మదగిన బ్యాటర్ గా కోహ్లీకి గుర్తింపు దక్కింది. ఇప్పుడు కోహ్లీ స్థానంలో వన్ డౌన్ కు ఆప్షన్స్ కూడా పలువురు ఆటగాళ్ళు ఉన్నారు. వరల్డ్ కప్ లో రిషబ్ పంత్ ను వన్ డౌన్ ఆడించగా పర్వాలేదనిపించాడు. ప్రస్తుత పరిస్థితుల్లో పంత్ ను అదే ప్లేస్ లో కొనసాగించే అవకాశముంది.

ఇక కోహ్లీ, రోహిత్ తో పాటే టీ ట్వంటీలకు ఆల్ రౌండర్ జడేజా కూడా రిటైర్మెంట్ ఇచ్చేశాడు. ఐపీఎల్ లో రాణించినంతగా జడేజా అంతర్జాతీయ టీ ట్వంటీల్లో తనదైన ముద్ర వేయలేకపోయాడు. కెరీర్ లో 74 మ్యాచ్ లు ఆడి 551 పరుగులే చేయగలిగాడు. లోయర్ ఆర్డర్ కావడంతో ఎక్కువ అవకాశాలు రాకపోవడం దీనికి కారణం. అటు బంతితో 54 వికెట్లు పడగొట్టాడు. బౌలింగ్ కోసమే జడేజాకు ఎక్కువ అవకాశాలు దక్కాయన్నది చాలా మంది అభిప్రాయం. ప్రస్తుతం జడేజా స్థానాన్ని భర్తీ చేసేందుకు పలువురు యువ క్రికెటర్లు ఉన్నారు. స్పిన్ బౌలింగ్ ఆప్షన్ కాకున్నా శివమ్ దూబే, తెలుగుతేజం నితీశ్ కుమార్ రెడ్డి వంటి ప్లేయర్స్ పోటీ పడుతున్నారు. మరికొందరు ఆటగాళ్ళు రానున్న రోజుల్లో వెలుగులోకి రావొచ్చు. మొత్తం మీద వచ్చే ప్రపంచకప్ కు భారత్ , శ్రీలంక ఆతిథ్యమిస్తుండగా… అప్పటి వరకూ షార్ట్ ఫార్మాట్ లో వీరంతా కొనసాగడం కష్టమే. అందుకే గౌరవంగా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారని చెప్పొచ్చు. మరి వీరి వీరి స్థానాల్లో ఎవరు తమకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని భర్తీ చేస్తారో చూడాలి.

Also Read: Rahul Gandhi : పార్లమెంట్ ను గ‌డ‌గ‌డ‌లాడించిన రాహుల్ గాంధీ