IPL Playoff Scenarios: ఆసక్తికరంగా ప్లే ఆఫ్ రేస్…

ఐపీఎల్ 17వ సీజన్‌ సెకండాఫ్ ఆసక్తికరంగా సాగుతోంది. ఇకపై జరిగే ప్రతీ మ్యాచ్‌లు ఆయా జట్లకు కీలకంగా ఉన్న నేపథ్యంలో విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ఏ జట్టు కూడా తగ్గేదే లేదు అంటూ సత్తా చాటుతుండడంతో ప్లే ఆఫ్ రేసు మరింత రసవత్తరంగా మారింది.

IPL Playoff Scenarios: ఐపీఎల్ 17వ సీజన్‌ సెకండాఫ్ ఆసక్తికరంగా సాగుతోంది. ఇకపై జరిగే ప్రతీ మ్యాచ్‌లు ఆయా జట్లకు కీలకంగా ఉన్న నేపథ్యంలో విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ఏ జట్టు కూడా తగ్గేదే లేదు అంటూ సత్తా చాటుతుండడంతో ప్లే ఆఫ్ రేసు మరింత రసవత్తరంగా మారింది. ప్రస్తుతం మ్యూజికల్ ఛైర్ మాదిరి పాయింట్ల పట్టికలో ఆయాజట్ల స్థానాలు మారిపోతూ ఉన్నాయి. తాజాగా చెన్నై సూపర్‌కింగ్స్, సన్‌రైజర్స్ మ్యాచ్ ముగిసిన తర్వాత టాప్ ఫోర్‌లో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. ఓవరాల్‌గానూ పలు జట్లు ముందంజ వేశాయి.

ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రాజస్థాన్ రాయల్స్ టాప్ ప్లేస్‌లో కొనసాగుతోంది. సూపర్ ఫాంలో ఉన్న ఆ జట్టు 8 విజయాలతో 16 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో ఉంది. మరొక్క విజయం సాధిస్తే రాజస్థాన్‌ అధికారకంగా ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అవుతుంది. రెండో స్థానంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 10 పాయింట్లతో కొనసాగుతోంది. ఆ జట్టు 8 మ్యాచ్‌లలో 5 విజయాలు సాధించింది. ఇక నిన్నటి వరకూ మూడో స్థానంలో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ నాలుగో స్థానానికి పడిపోయింది. చెన్నైతో మ్యాచ్ తర్వాత వరుసగా రెండో పరాజయం చవిచూడడమే దీనికి కారణం. అదే సమయంలో చెన్నై ఐదో విజయంతో మూడో స్థానానికి దూసుకొచ్చింది. సన్‌రైజర్స్‌పై విజయంతో రన్‌రేట్‌ కూడా పెంచుకున్న సీఎస్‌కే మూడో ప్లేస్‌కు చేరింది.

ఇదిలా ఉంటే ఫస్టాఫ్‌లో పేలవ ప్రదర్శన కనబరిచిన పలు జట్లు సెకండాఫ్‌లో పుంజుకుంటున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ మళ్లీ గెలుపు బాటలో దూసుకెళుతోంది. వరుసగా రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో ఆరో ప్లేస్‌లో కొనసాగుతోంది. లక్నో సూపర్‌జెయింట్స్ ఖాతాలో కూడా 10 పాయింట్లే ఉన్నప్పటికి మెరుగైన రన్‌రేట్ కారణంగా ఆ జట్టు ఐదో స్థానంలో నిలిచింది. గుజరాత్ టైటాన్స్ 4 విజయాలతో ఏడో స్థానంలోనూ, పంజాబ్ కింగ్స్ మూడు విజయాలతో ఎనిమిదో స్థానంలోనూ కొనసాగుతుండగా… ముంబై ఇండియన్స్ మూడు విజయాలే సాధించినా రన్‌రేట్ తక్కువగా ఉండడంతో తొమ్మిదో స్థానానికే పరిమితమైంది. ఇక ప్లే ఆఫ్ రేసుకు దాదాపు దూరమైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పాయింట్ల పట్టికలో చిట్టిచివరి స్థానంలో ఉంది. ప్లే ఆఫ్ చేరాలంటే కనీసం 16 పాయింట్లు సాధించాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి బెంగళూరుకు తప్ప మిగిలిన అన్ని జట్లకు 16 పాయింట్లు సాధించే అవకాశముంది. ఈ నేపథ్యంలో రన్‌రేట్ కీలకం కానుంది.

Also Read: Shah Deepfake Video: అమిత్ షా ఫేక్ వీడియో కేసులో ఇంతకీ ఏం జరిగింది?