Site icon HashtagU Telugu

Who Slapped Taylor: రాస్ టేలర్ కొట్టింది అతనేనా ?

Ross Taylor

Ross Taylor

డకౌట్ అయినందుకు ఫ్రాంచైజీ ఓనర్ చెంపదెబ్బ కొట్టాడంటూ కివీస్ మాజీ ఆటగాడు రాస్ టేలర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. ఈ ఘటన ఎప్పుడు జరిగిందంటూ చాలా మంది ఆరా తీస్తుంటే…టేలర్ ను కొట్టింది ఎవరనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ ఓనర్లలో ప్రముఖంగా వినిపించే వ్యక్తే టేలర్ పట్ల ఇలా ప్రవర్తించాడా అన్న చర్చ మొదలైంది.సినీనటి శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రాయే అతడిని కొట్టి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

రాజస్థాన్‌ రాయల్స్‌పై నిషేధం వేటు పడేంత వరకు రాజ్‌కుంద్రా జట్టుతోనే ఉన్నాడు. 2015 సీజన్‌ వరకు జట్టుతోనే ప్రయాణించేవాడు. రాస్‌ టేలర్‌ తన ఆత్మకథలో రాసుకున్న ఘటన నాలుగో ఎడిషన్లో చోటు చేసుకుంది. అప్పట్లో రాజస్థాన్‌ రాయల్స్‌ పర్యటించిన ప్రతి స్టేడియానికి శిల్పా, కుంద్రా వెళ్లేవారు. 2011-12 సీజన్లో కుంద్రా దంపతులు మినహా మిగతా భాగస్వాములు జట్టుతో ఉండేవారు కాదని అప్పడున్నవాళ్లు చెబుతున్నారు.

మనోజ్‌ బాదలే అప్పుడప్పుడు వస్తుండేవారనీ, బహుశా టేలర్‌ చెబుతున్న యజమాని రాజ్‌కుంద్రాయే కావొచ్చనీ గతంలో ఆ జట్టుకు పనిచేసిన వారు చెబుతున్నారు. ఐపీఎల్‌లో ఆడినప్పుడు ఓ ఫ్రాంచైజీ యజమాని తనను కొట్టాడని రాస్ టేలర్ ఆరోపించాడు. తన ఆటో బయోగ్రఫీ బ్లాక్ అండ్ వైట్ పుస్తకంలో ఈ విషయం వెల్లడించాడు. రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్నప్పుడు ఈ ఘటన జరిగినట్టు టేలర్ తన పుస్తకంలో పేర్కొన్నాడు. ప్రస్తుతం టేలర్ చేసిన వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.