T20 Asia Cup: 2025 ఆసియా కప్ టోర్నమెంట్ టీ20 (T20 Asia Cup) ఫార్మాట్‌లో సెప్టెంబర్ 9 నుండి 28 వరకు యూఏఈలో జరగనుంది. ఈ మెగా టోర్నమెంట్ ప్రారంభానికి ముందు, టీ20 ఆసియా కప్‌లో ఒక అవాంఛనీయ రికార్డు గురించి ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఈ టోర్నమెంట్‌లో అత్యధిక సార్లు సున్నాకి ఔట్ అయిన బ్యాట్స్‌మెన్ ఎవరో తెలుసుకుందాం.
అవాంఛనీయ రికార్డు మష్రఫీ మోర్తజా పేరిట
ఈ అవాంఛనీయ రికార్డు బంగ్లాదేశ్ మాజీ దిగ్గజ ఆటగాడు, కెప్టెన్ మష్రఫీ మోర్తజా పేరిట ఉంది. మోర్తజా 2016 ఆసియా కప్‌లో ఐదు మ్యాచ్‌లు ఆడి, బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమయ్యాడు. ఐదు ఇన్నింగ్స్‌లలో 3.50 సగటుతో కేవలం 14 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో మూడు సార్లు అతను ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరుకున్నాడు. అప్పటి నుండి ఈ రికార్డు అతని పేరిటనే ఉంది.
Also Read: Kishtwar : కిష్త్వార్‌లో భయానక ప్రళయం..! మూడో రోజు కూడా కొనసాగుతున్న సహాయక చర్యలు
హార్దిక్ పాండ్యా కూడా ఈ జాబితాలో
ఈ అవాంఛనీయ జాబితాలో భారత ఆటగాడు హార్దిక్ పాండ్యా కూడా ఉన్నాడు. టీ20 ఆసియా కప్‌లో అత్యధిక సార్లు సున్నాకి ఔట్ అయిన వారి జాబితాలో హార్దిక్ పాండ్యా, శ్రీలంకకు చెందిన చరిత్ అసలంక, పాకిస్తాన్‌కు చెందిన ఆసిఫ్ అలీ, యూఏఈకి చెందిన కించిత్ షా, శ్రీలంకకు చెందిన కుసల్ మెండిస్, దసున్ షనకతో కలిసి సంయుక్తంగా రెండవ స్థానంలో ఉన్నారు. వీరంతా రెండు సార్లు చొప్పున సున్నాకి ఔటయ్యారు.
2025 ఆసియా కప్
ఈ ఏడాది ఆసియా కప్‌లో మొత్తం 8 జట్లు పాల్గొననున్నాయి. సెప్టెంబర్ 10న టీమ్ ఇండియా తమ ప్రయాణాన్ని యూఏఈతో ప్రారంభించనుంది. సెప్టెంబర్ 14న పాకిస్తాన్‌తో హై-వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. గ్రూప్ దశలో భారత్, పాకిస్తాన్, ఒమన్, యూఏఈ జట్లు గ్రూప్-ఎలో ఉండగా, గ్రూప్-బిలో బంగ్లాదేశ్, శ్రీలంక, హాంకాంగ్-చైనా, ఆఫ్ఘనిస్తాన్ ఉన్నాయి.