Anshul Kamboj: ఇంగ్లండ్‌తో మాంచెస్టర్‌లో జరగనున్న నాల్గవ టెస్ట్ మ్యాచ్ కోసం భారత స్క్వాడ్‌లో 24 ఏళ్ల యువ ఆల్‌రౌండర్ అంశుల్ కంబోజ్(Anshul Kamboj)ను చేర్చినట్లు వార్తలు వస్తున్నాయి. అర్ష్‌దీప్ సింగ్ గాయం కారణంగా అతనికి జట్టులో అవకాశం లభించింది. అంశుల్ అద్భుతమైన బౌలర్ మాత్రమే కాకుండా బ్యాటింగ్‌లో కూడా తన సత్తా చాటగలడు. భారత్ సిరీస్‌లో 1-2తో వెనుకబడిన నేపథ్యంలో ఈ ‘డూ ఆర్ డై’ మ్యాచ్‌లో అంశుల్ వస్తే జట్టుకు బలం చేకూరినట్లే అని క్రీడా పండితులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
అంశుల్ కంబోజ్ ప్రొఫైల్ ఇదే!
అంశుల్ కంబోజ్ డిసెంబర్ 6, 2000న హర్యానాలోని కర్నాల్ జిల్లాలో జన్మించాడు. అతను కుడిచేతి మీడియం ఫాస్ట్ బౌలర్, ఆల్‌రౌండర్. 2021 నుంచి హర్యానా తరపున దేశీయ క్రికెట్ ఆడుతున్నాడు.
దేశీయ క్రికెట్‌లో నిలకడైన ప్రదర్శన
గత నెలలో అంశుల్ ఇంగ్లండ్‌లోనే ఉన్నాడు. అక్కడ ఇండియా-ఎ తరపున ఇంగ్లండ్ లయన్స్‌తో రెండు ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. మొదటి మ్యాచ్‌లో 1 వికెట్ తీసి 23 పరుగులు చేశాడు. రెండవ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 4 (2+2) వికెట్లు తీయడమే కాకుండా ఒక అర్ధసెంచరీ కూడా సాధించి ఆల్‌రౌండ్ నైపుణ్యాన్ని ప్రదర్శించాడు.
Also Read: Old Trafford: మాంచెస్టర్‌లో భారత్‌ను దెబ్బ కొట్టేందుకు ఇంగ్లాండ్ ‘గడ్డి’ వ్యూహం!
అంశుల్ కంబోజ్ ఫిబ్రవరి 2022లో హర్యానా తరపున త్రిపురతో రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేశాడు. 2022-23 సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో 7 మ్యాచ్‌లలో 7 వికెట్లు తీశాడు. 2023-24 విజయ్ హజారే ట్రోఫీలో 10 మ్యాచ్‌లలో 17 వికెట్లు సాధించాడు. ఈ నిలకడైన ప్రదర్శనల ఆధారంగానే అతన్ని ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. 2024-25 దులీప్ ట్రోఫీలో ఇండియా సి తరపున 3 మ్యాచ్‌లలో 16 వికెట్లు తీశాడు.
రంజీ ట్రోఫీలో చారిత్రాత్మక ఘనత
నవంబర్ 2024లో రంజీ ట్రోఫీ సందర్భంగా అంశుల్ ఒక చారిత్రాత్మక స్పెల్ వేశాడు. కేరళపై ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసి ఈ ఘనత సాధించిన మూడవ బౌలర్‌గా నిలిచాడు. రోహ్‌తక్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో అతను 30.1 ఓవర్లలో 49 పరుగులు ఇచ్చి ఈ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు.
ఐపీఎల్ ప్రస్థానం
అంశుల్ ఐపీఎల్ కెరీర్‌ను 2024లో ముంబై ఇండియన్స్ తరపున ఆడుతూ ప్రారంభించాడు. ఆ సీజన్‌లో అతను 3 మ్యాచ్‌లలో 2 వికెట్లు తీశాడు. 2025లో అతను ఎంఎస్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడాడు. ఈ సీజన్‌లో 8 మ్యాచ్‌లలో 8 వికెట్లు తీశాడు. అర్ష్‌దీప్ సింగ్ గాయం కారణంగా టెస్ట్ స్క్వాడ్‌లోకి రానున్న అంశుల్ కంబోజ్.. ఇప్పుడు మాంచెస్టర్‌లో జులై 23 నుంచి ప్రారంభమయ్యే నాల్గవ టెస్ట్‌లో టీమ్ ఇండియాకు కీలకమైన ఆటగాడిగా మారే అవకాశం ఉంది.
అతని ఫస్ట్-క్లాస్ రికార్డ్
- మ్యాచ్‌లు: 24
- వికెట్లు: 79
- పరుగులు: 486
- 10 వికెట్ల హాల్: 1 సారి
- 5 వికెట్ల హాల్: 2 సార్లు
- 4 వికెట్ల హాల్: 2 సార్లు