Akash Madhwal: ముంబైకి మరో బుమ్రానా.. ఎవరీ ఆకాశ్‌ మద్వాల్‌..? ఉద్యోగం మానేసి క్రికెటర్‌ అయ్యాడా..!

ఐదు పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టిన ఆకాశ్ మద్వాల్‌ (Akash Madhwal) ముంబై ఇండియన్స్ విజయానికి హీరో. మ్యాచ్ అనంతరం మద్వాల్‌ (Akash Madhwal) తన విజయ రహస్యాన్ని బయటపెట్టాడు.

  • Written By:
  • Updated On - May 25, 2023 / 12:24 PM IST

Akash Madhwal: ఐపీఎల్ సీజన్ 16లో బుధవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 81 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్‌ను ఓడించింది. ఈ విజయంతో ముంబై ఇండియన్స్‌ క్వాలిఫయర్‌ 2కి చేరుకోగలిగింది. ఐదు పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టిన ఆకాశ్ మద్వాల్‌ (Akash Madhwal) ముంబై ఇండియన్స్ విజయానికి హీరో. మ్యాచ్ అనంతరం మద్వాల్‌ (Akash Madhwal) తన విజయ రహస్యాన్ని బయటపెట్టాడు.

ముంబై ఇండియన్స్ ఫాస్ట్ బౌలర్ మాట్లాడుతూ.. నేను చాలా ప్రాక్టీస్ చేస్తున్నాను. అవకాశం కోసం ఎదురు చూశా. నేను ఇంజినీరింగ్ చేశాను. క్రికెట్ అంటే నా అభిరుచి. ఈ అవకాశం కోసం 2018 నుంచి ఎదురు చూస్తున్నాను. మేము నెట్స్‌లో ప్రాక్టీస్ చేసినప్పుడల్లా మేనేజ్‌మెంట్ ద్వారా మాకు లక్ష్యాలు ఇస్తారు. ఆ లక్ష్యాలను సాధించడమే మా ప్రయత్నం. మేము మా ఉత్తమమైనదాన్ని అందించడానికి ప్రయత్నిస్తామని తెలిపాడు.

Also Read: IPL 2023: నవీన్ ఉల్ హక్‌కు ముంబై ఆటగాళ్లు కౌంటర్.. ఏం చేశారంటే..?

లక్నోపై 5 వికెట్లు తీసిన ముంబై బౌలర్ ఆకాశ్‌ మద్వాల్‌ గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. 1993లో రూర్కీలో జన్మించిన ఇతను సివిల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసి ఉద్యోగం కూడా చేశాడు. ఆ తర్వాత క్రికెట్‌పై ఆసక్తి పెరగడంతో ప్రాక్టీస్‌ మొదలుపెట్టాడు. 2019లో తొలిసారి ముస్తాక్‌ అలీ ట్రోఫీలో ఆడేందుకు ఉత్తరాఖండ్‌ జట్టుకు ఎంపికయ్యాడు. కోచ్‌ జాఫర్‌ సూచనలతో రాటుదేలాడు. ఇతని ప్రతిభ గుర్తించి ముంబై అవకాశం కల్పించడంతో ఆడిన మ్యాచ్ లో అదరగొట్టాడు.

అయితే ముంబై ఇండియన్స్ తరఫున ఆకాష్‌కు ప్రథమార్థంలో ఆడే అవకాశం రాలేదు. కానీ అర్జున్ టెండూల్కర్ సక్సెస్ కాకపోవడంతో ఆకాష్ కు అవకాశం ఇచ్చారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఆకాష్ ఎలాంటి ఛాన్స్ వదలలేదు. కేవలం కొన్ని మ్యాచ్‌ల్లోనే ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కు అత్యంత విజయవంతమైన ఫాస్ట్ బౌలర్‌గా ఆకాష్ నిలిచాడు. ఆకాష్ బౌలింగ్ కారణంగానే ఐపీఎల్ తొలి అర్ధభాగంలో 9వ స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో 81 పరుగుల తేడాతో గెలుపొందింది. శుక్రవారం జరిగే క్వాలిఫయర్ 2లో ముంబై ఇండియన్స్ గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది.

మద్వాల్‌ 2021లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు శిబిరంలో భాగంగా ఉన్నాడు. అతను RCB నెట్ బౌలర్. 2022 వేలంలో అమ్ముడుపోని తర్వాత గాయపడిన సూర్యకుమార్ యాదవ్‌కు బదులుగా ముంబై ఇండియన్స్ అతన్ని ఎంపిక చేసింది. మద్వాల్‌ సామర్థ్యాన్ని చూసి MI అతనిని ఈ సీజన్‌కు కూడా ఉంచాలని నిర్ణయించుకుంది.