Site icon HashtagU Telugu

Punjab Kings: ఆర్టీఎంతో పంజా విసురుతున్న పంజాబ్!

PBKS Team 2025 Player List

PBKS Team 2025 Player List

Punjab Kings: ఐపీఎల్ 18వ సీజన్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి. తదుపరి సీజన్ కోసం నవంబర్ 24, 25 తేదీలలో సౌదీ అరేబియాలోని జెడ్డాలో మెగా వేలం జరుగుతుంది. అంతకుముందు అన్ని ఫ్రాంచైజీలు తమ రిటైన్ చేసిన ఆటగాళ్ల జాబితాను విడుదల చేశాయి. పంజాబ్ కింగ్స్ (Punjab Kings) ఇద్దరు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసింది. శశాంక్ సింగ్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌లపై జట్టు విశ్వాసం వ్యక్తం చేసింది. శశాంక్ కోసం 5.5 కోట్లు ఖర్చు చేయగా, ప్రభసిమ్రాన్ సింగ్ కోసం 4 కోట్లు వెచ్చించింది. ఇప్పుడు ఫ్రాంచైజీ పర్స్‌లో 110.5 కోట్లు మిగిలి ఉన్నాయి. కాగా పంజాబ్ కింగ్స్ ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ వేలంలో రిషబ్ పంత్‌ని దక్కించుకోవాలని చూస్తున్నాడు. అతని కోసం భారీగా ఖర్చు చేసేందుకు ప్రీతి జింతతో కలిసి సంప్రదింపులు కూడా జరిపాడట.

పంత్ తో పాటు రవి బిష్ణోయ్, లియామ్ లివింగ్‌స్టోన్, జానీ బెయిర్‌స్టో, అర్ష్‌దీప్ సింగ్‌లపై పాంటింగ్ కన్నేశాడు. వాస్తవానికి పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కోసం వెతుకుతోంది. ఈ పరిస్థితిలో, రిషబ్ పంత్‌ వాళ్లకు బెస్ట్ ఆప్షన్ గా కనిపిస్తున్నాడు. విశేషమేంటంటే పంత్ మరియు పంజాబ్ ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ ఇద్దరూ ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి వచ్చినవాళ్లే. పాంటింగ్ కు పంత్ పోటెన్షయాలిటీ ఏంటో తెలుసు. అంతేకాదు పంత్ కెప్టెన్ మరియు మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌తో పాటు వికెట్‌కీపర్ గానూ జట్టుకు ఉపయోగపడతాడు.

Also Read: Dhoni Master Plan: ధోనీ మాస్టర్ ప్లాన్.. సీనియర్లతో బరిలోకి

ఇప్పుడు అతని సేవలను పంజాబ్ ఉపయోగించుకోవాలనుకుంటుంది. పంత్ తన కెరీర్‌లో ఇప్పటివరకు 111 ఐపీఎల్ మ్యాచ్‌లలో 3284 పరుగులు చేశాడు. ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. పంజాబ్ కింగ్స్ అర్ష్‌దీప్ సింగ్‌ను రిటైన్ చేయలేదు. దీంతో పంజాబ్ అతనిని రైట్ టు మ్యాచ్ కార్డ్ ద్వారా జట్టులోకి తీసుకునేందుకు సన్నాహాలు చేస్తుంది. అర్ష్‌దీప్ ఇప్పటి వరకు 65 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి 76 వికెట్లు తీశాడు. గత సీజన్‌లో అతను 19 వికెట్లు పడగొట్టాడు.

పంజాబ్ కింగ్స్‌కు గరిష్టంగా 4 రైట్ టు మ్యాచ్ కార్డ్‌లను ఉపయోగించుకునేందుకు అవకాశముంది. ఈ నేపథ్యంలో వేలంలో వాటిని పూర్తిగా ఉపయోగించుకోవాలనుకుంటోంది. వేలం సమయంలో పంజాబ్ కింగ్స్ RTM ద్వారా లియామ్ లివింగ్‌స్టోన్‌ను కూడా తీసుకోవాలని భావిస్తుంది. స్టోన్ గత సీజన్‌లో 7 మ్యాచ్‌ల్లో 111 పరుగులు చేశాడు. లీగ్‌లో 39 మ్యాచ్‌ల్లో 939 పరుగులు చేశాడు. ఇక రైట్ టు మ్యాచ్ కార్డ్‌ ఉపయోగించి జానీ బెయిర్‌స్టోను జోడించవచ్చు. బెయిర్‌స్టో రాకతో జట్టుకు ఇద్దరు వికెట్‌కీపింగ్ ఆప్షన్‌లు లభించనున్నాయి. గత సీజన్‌లో జానీ 11 మ్యాచ్‌ల్లో 298 పరుగులు చేశాడు. ఇది కాకుండా అతను తన కెరీర్‌లో ఇప్పటివరకు 50 ఐపిఎల్ మ్యాచ్‌లు ఆడాడు. ఐపీఎల్‌లో బెయిర్‌స్టో 1589 పరుగులు చేశాడు.