Rich Cricketer: క్రికెట్ ప్రపంచంలో అత్యధిక సంపద కలిగిన ఆటగాళ్లలో భారత క్రికెటర్లు ఆధిపత్యం చెలాయిస్తున్నారు. అభిమానుల సంఖ్యలో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నప్పటికీ నికర సంపద విషయంలో మాత్రం ‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండూల్కర్ ముందంజలో ఉన్నారు. ఇటీవల విడుదలైన నివేదికల ప్రకారం.. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన క్రికెటర్‌గా (Rich Cricketer) సచిన్ నిలిచారు.
సచిన్ టెండూల్కర్
క్రికెట్‌లో రెండు దశాబ్దాలకు పైగా నిలిచి, అసంఖ్యాక రికార్డులను నెలకొల్పిన సచిన్ టెండూల్కర్ నికర విలువ దాదాపు రూ. 1,400 కోట్లుగా అంచనా వేయబడింది. క్రికెట్ నుంచి రిటైరైన తర్వాత కూడా ఆయన వివిధ బ్రాండ్‌లకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. వ్యాపార పెట్టుబడులు పెడుతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఆయనకున్న గుర్తింపు, నమ్మదగిన వ్యక్తిగా ఆయనకున్న పేరు బ్రాండ్లకు ఆకర్షణగా నిలిచాయి. క్రికెట్ చరిత్రలో అత్యధికంగా సంపాదించిన ఆటగాళ్ళలో ఆయన అగ్రస్థానంలో ఉన్నారు.
Also Read: Sarpanch Elections: సర్పంచ్ ఎన్నికలపై రేవంత్ సర్కార్ కీలక ప్రకటన!
విరాట్ కోహ్లీ
ఆధునిక క్రికెట్‌లో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న ఆటగాడు విరాట్ కోహ్లీ. ఇన్‌స్టాగ్రామ్‌లో అతనిని అనుసరించే వారి సంఖ్య ఏకంగా 250 మిలియన్లకు పైగా ఉంది. ఇది ఏ ఇతర క్రికెటర్‌కు సాధ్యం కాని రికార్డు. విరాట్ కోహ్లీ నికర విలువ రూ. 1,050 కోట్లుగా అంచనా. క్రికెట్ మ్యాచ్ ఫీజు, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) జీతంతో పాటు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ల ద్వారా కోహ్లీ భారీగా ఆదాయం పొందుతున్నారు. అడిడాస్, ప్యూమా, బూస్ట్, ఉబర్, ఎంఆర్ఎఫ్ వంటి ప్రపంచ స్థాయి బ్రాండ్లతో అతనికున్న ఒప్పందాలు అతని సంపదకు ప్రధాన కారణం. అంతేకాకుండా ముంబైలో రూ. 34 కోట్ల ఇల్లు, గురుగ్రామ్‌లో దాదాపు రూ. 80 కోట్ల ఇల్లు వంటి స్థిరాస్తులు కూడా అతని నికర విలువలో భాగంగా ఉన్నాయి.
మహేంద్ర సింగ్ ధోనీ
భారత జట్టుకు రెండు ప్రపంచ కప్‌లు అందించిన మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఈ జాబితాలో మూడవ స్థానంలో ఉన్నారు. అతని నికర విలువ రూ. 1,000 కోట్లు దాటినట్లు అంచనా. ధోని ఆదాయ మార్గాలు క్రికెట్‌కు మాత్రమే పరిమితం కాలేదు. ఆయన తెలివైన పెట్టుబడులకు ప్రసిద్ధి. చెన్నై సూపర్ కింగ్స్‌కు కెప్టెన్‌గా, బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండటమే కాకుండా తనకంటూ ఒక ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీని, ఒక ఫుట్‌బాల్ క్లబ్‌ను కూడా సొంతం చేసుకున్నారు. ఆయనకున్న వ్యాపార తెలివితేటలు, దూరదృష్టి కారణంగా ధోని క్రికెట్ నుంచి రిటైరైన తర్వాత కూడా అపారమైన సంపదను కూడబెట్టుకుంటున్నారు.