2026లో కూడా భారత్- పాకిస్థాన్ మ‌ధ్య హోరాహోరీ మ్యాచ్‌లు!

జింబాబ్వే, నమీబియా వేదికలుగా 2026 ఫిబ్రవరి-మార్చి నెలల్లో అండర్-19 ప్రపంచకప్ జరగనుంది. ఈ టోర్నీ లీగ్ దశలో భారత్, పాకిస్థాన్ జట్లు నేరుగా తలపడనప్పటికీ సెమీఫైనల్ లేదా ఫైనల్ దశలో ఈ రెండు జట్లు తలపడే అవకాశం ఉంది.

Published By: HashtagU Telugu Desk
India- Pakistan

India- Pakistan

India- Pakistan: భారత్- పాకిస్థాన్ జట్ల మధ్య ఎప్పుడూ హైవోల్టేజ్ మ్యాచ్‌లు జరుగుతుంటాయి. 2025వ సంవత్సరంలో కూడా ఈ రెండు జట్ల మధ్య అనేక ఆసక్తికర పోరాటాలు జరిగాయి. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టు అద్భుత ప్రదర్శన చేసి పాకిస్థాన్‌ను ఓడించింది. ఆ తర్వాత ఆసియా కప్ 2025లో కూడా టీమ్ ఇండియా ఏకంగా మూడుసార్లు పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. ఇందులో ఫైనల్ మ్యాచ్ కూడా ఉండటం విశేషం. ఇప్పుడు 2026 సంవత్సరంలో కూడా భారత్- పాకిస్థాన్ జట్ల మధ్య పలుమార్లు హోరాహోరీ పోరు జరగనుంది.

2026 టీ-20 ప్రపంచకప్‌కు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. ఈ టోర్నీలో భాగంగా ఫిబ్రవరి 15న శ్రీలంక రాజధాని కొలంబోలో భారత్- పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారత జట్టు ఫిబ్రవరి 7న అమెరికాతో జరిగే మ్యాచ్‌తో తన ప్రస్థానాన్ని ప్రారంభిస్తుంది. మొత్తం 20 జట్లు పాల్గొనే ఈ ప్రపంచకప్‌లో భారత్ తన ఆధిపత్యాన్ని చాటుకోవాలని భావిస్తోంది. గత 2024 టీ-20 ప్రపంచకప్‌లో కూడా రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమ్ ఇండియా పాకిస్థాన్‌ను ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.

Also Read: చెవిలో శబ్దాలు వస్తుంటే ఏం చేయాలి?

జింబాబ్వే, నమీబియా వేదికలుగా 2026 ఫిబ్రవరి-మార్చి నెలల్లో అండర్-19 ప్రపంచకప్ జరగనుంది. ఈ టోర్నీ లీగ్ దశలో భారత్, పాకిస్థాన్ జట్లు నేరుగా తలపడనప్పటికీ సెమీఫైనల్ లేదా ఫైనల్ దశలో ఈ రెండు జట్లు తలపడే అవకాశం ఉంది. భారత అండర్-19 జట్టు తన మొదటి మ్యాచ్‌ను జనవరి 15న అమెరికాతో ఆడుతుంది.

అదేవిధంగా మహిళల క్రికెట్‌లో కూడా భారత్, పాకిస్థాన్ మధ్య ఉత్కంఠభరిత పోరు జరగనుంది. ఐసీసీ మహిళల టీ-20 ప్రపంచకప్ 2026కు ఇంగ్లాండ్ ఆతిథ్యం ఇస్తోంది. జూన్ 12న ప్రారంభమయ్యే ఈ టోర్నీలో జూన్ 14న బర్మింగ్‌హామ్ వేదికగా భారత్- పాకిస్థాన్ జట్ల మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ టోర్నీలో రెండు జట్లకు ఇదే మొదటి మ్యాచ్ కావడం విశేషం. 2025 మహిళల వన్డే ప్రపంచకప్‌లో కూడా శ్రీలంకలో జరిగిన మ్యాచ్‌లో భారత్ పాకిస్థాన్‌ను ఘోరంగా ఓడించింది. ఇలా 2026లో కూడా క్రికెట్ మైదానంలో భారత్-పాక్ సమరం అభిమానులకు కనువిందు చేయనుంది.

  Last Updated: 27 Dec 2025, 07:44 PM IST