39 years of 1983 World Cup triumph : 1983 జూన్ 25.. భారత క్రికెట్ కు గోల్డెన్ డే!

నేటికి సరిగ్గా 39 సంవత్సరాల క్రితం.. 1983 జూన్ 25న క్రికెట్ ప్రపంచంలో కొత్త చరిత్ర లిఖితమైంది.కోట్లాది భారతీయుల కల నెరవేరింది.

  • Written By:
  • Publish Date - June 25, 2022 / 01:00 PM IST

నేటికి సరిగ్గా 39 సంవత్సరాల క్రితం.. 1983 జూన్ 25న క్రికెట్ ప్రపంచంలో కొత్త చరిత్ర లిఖితమైంది.కోట్లాది భారతీయుల కల నెరవేరింది. క్రికెట్ ప్రపంచ కప్ భారత్ కు చేజిక్కింది. కపిల్ సేన అదుర్స్ అనిపించింది. గార్డెన్ గ్రీనిడ్జ్, డెస్మండ్ హేన్స్, వివ్ రిచర్డ్స్, క్లైవ్ లాయిడ్, మాల్కమ్ మార్షల్ వంటి దిగ్గజాలున్న వెస్టిండీస్‌ జట్టును భారత్ మట్టికరిపించింది. ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో జరిగిన ఆ మ్యాచ్ రోమాంచితంగా జరిగింది.

అలా అంచనాలు పెరిగిపోయాయి..

భారత జట్టుపై పెద్దగా అంచనాలేవీ లేవు. అంతకుముందు 1975, 1979 ప్రపంచకప్‌లలో భారత జట్టు ఒకే ఒక్క మ్యాచ్‌లో గెలిచింది. 1983 ప్రపంచకప్ కోసం యూకే కు వెళ్లిన ఇండియా టీమ్ ను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.
రెండో గ్రూప్ స్టేజ్‌లో జింబాబ్వేను భారత్ మట్టికరిపించింది. అయితే, ఆ తర్వాతి మ్యాచుల్లో ఆస్ట్రేలియా, వెసిండీస్ చేతుల్లో భారీ ఓటములు కపిల్ సేనను ఇబ్బందులకు గురిచేశాయి. ఆ తర్వాత టన్‌బ్రిజ్ వెల్స్‌లో జింబాబ్వేపై కపిల్ దేవ్ 175 పరుగులు చేసి జట్టుకు అద్భుత విజయాన్ని అందించిన తర్వాత భారత జట్టుపై అంచనాలు పెరిగిపోయాయి.

ఫైనల్ ఇలా..

అప్పటికే రెండుసార్లు ప్రపంచకప్‌లు గెలుచుకున్న విండీస్‌..హ్యాట్రిక్ కోసం ఎదురుచూస్తూ ఫైనల్‌లో భారత్ తో తలపడింది. విండీస్ కెప్టెన్ క్లైవ్‌ లియోడ్‌ టాస్‌ గెలిచి భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. సునీల్ గవాస్కర్ 2 పరుగులకే ఔట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మొహిందర్ అమర్‌నాథ్ (26)తో కలిసి కృష్ణమాచారి శ్రీకాంత్ (38) 57 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయితే విండీస్ బౌలర్లు చెలరేగడంతో భారత బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది.  యశ్‌పాల్‌ శర్మ (11), సందీప్‌ పాటిల్‌ (27), కపిల్‌ దేవ్‌ (15) పెద్దగా రాణించలేక పోయారు.  మదన్ లాల్ (17), సయ్యద్ కిర్మాణి (14), బల్విందర్ సంధు (11) సమన్వయంతో ఆడడంతో కపిల్ సేన 183 పరుగులు చేసి ప్రత్యర్థికి సవాలు విసిరింది.

140 పరుగులకే కుప్పకూలిన విండీస్..

బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన క్లైవ్ లాయిడ్ సేనకు 184 పరుగుల విజయ లక్ష్యం చాలా తక్కువ. అయినా కపిల్ పట్టువదల్లేదు. ఐదు పరుగుల వద్దే ఓపెనర్ గార్డెన్ గ్రీనిడ్జ్‌ (1) బౌల్డ్ చేసిన సంధు భారత్ అభిమానుల్లో ఆశలు పెంచాడు. వివియన్ రిచర్డ్స్ మాత్రం భారత శిబిరంలో గుబులు రేపాడు. 28 బంతుల్లో 7 బౌండరీలతో 33 పరుగులు చేసిన రిచర్డ్స్‌ను మదన్‌లాల్ అద్భుతమైన బంతితో బురిడీ కొట్టించాడు. భారీ షాట్‌ను ఆడబోయిన రిచర్డ్స్ బంతిని గాల్లోకి లేపగా కపిల్ అద్భుతమైన క్యాచ్‌తో రిచర్డ్స్‌ను పెవిలియన్ పంపాడు. భారత బౌలర్లు అమర్‌నాథ్, మదన్ లాల్, కపిల్, సంధు, రోజర్ బిన్నీలు జూలు విదిల్చడంతో విండీస్ 140 పరుగులకే కుప్పకూలింది. 39 సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే రోజున లార్డ్స్ బాల్కనీలో కపిల్ దేవ్ ప్రపంచ కప్ ట్రోఫీని సగర్వంగా అందుకున్నాడు.