Site icon HashtagU Telugu

Harbhajan: ఆ తప్పు సరిదిద్దుకోవాలనుకుంటున్నా

harbhajan singh

harbhajan singh

ఐపీఎల్ చరిత్రలో హర్భజన్, శ్రీశాంత్ చెంప దెబ్బ వివాదం ఎవ్వరూ మరిచిపోలేరు. గ్రౌండ్ లో మన దేశానికే చెందిన ఒక ఆటగాడు మరో ఆటగాడిపైచెయ్యి చేసుకోవడం ఎప్పుడూ జరగలేదు. దీంతో ఈ ఘటన తీవ్ర సంచలనమయింది. తాజాగా ఈ వివాదంపై భజ్జీ పశ్చాతాపం వ్యక్తం చేశాడు.
ముంబై ఇండియన్స్‌, అప్పటి కింగ్స్‌ లెవన్‌ పంజాబ్‌ టీమ్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ తర్వాత ఫీల్డ్‌లోనే శ్రీశాంత్‌ను హర్భజన్‌ చెంపదెబ్బ కొట్టడం, ఆ తర్వాత శ్రీశాంత్‌ చిన్న పిల్లాడిలా ఏడుస్తూ కనిపించడం ఫ్యాన్స్‌ను షాక్‌కు గురి చేసింది. ఆ మ్యాచ్‌లో ముంబై ఓడిన ఫ్రస్ట్రేషన్‌లో ఉన్న భజ్జీ.. శ్రీశాంత్ తన దగ్గరకు రాగానే సహనం కోల్పోయి చేయి చేసుకున్నాడు.

అతడు కొట్టినట్లు వీడియో ఎక్కడా లేకపోయినా.. శ్రీశాంత్‌ ఏడుస్తున్న వీడియో మాత్రం తెగ వైరల్‌ అయింది. ఆ ఘటనపై తర్వాత చాలాసార్లు హర్భజన్‌ స్పందించాడు. అది తన పొరపాటే అని కూడా చెప్పాడు. అయితే తాజాగా మరోసారి శ్రీశాంత్‌తోపాటు క్రికెట్‌ ప్రెజెంటర్‌ విక్రమ్‌ పాల్గొన్న చర్చలో భజ్జీ ఆ ఘటనపై మాట్లాడాడు.
తన కెరీర్‌లో చేసిన పొరపాట్లలో తాను సరిదిద్దుకోవాలని అనుకుంటున్న పొరపాటు అదేనని అన్నాడు. ఆ రోజు జరిగింది తప్పేననీ, తన వల్ల తన టీమ్‌ మేట్‌ ఇబ్బంది పడ్డాడనీ అంగీకరించాడు. ఈ పరిణామం తర్వాత తాను కూడా ఇబ్బంది పడాల్సి వచ్చిందన్నాడు. ఒకవేళ తాను సరిదిద్దుకోవాలని అనుకునే పొరపాటు ఏదైనా ఉందంటే అది శ్రీశాంత్‌తో నేను వ్యవహరించిన తీరేననీ చెప్పుకొచ్చాడు. నిజానికి అది జరగాల్సింది కాదనీ హర్భజన్‌ అన్నాడు.
అయితే ఇదే విషయంపై శ్రీశాంత్ గతంలో స్పందించాడు. ఆ వివాదం జరిగిన తర్వాత సచిన్ టెండూల్కర్ మా ఇద్దరిని కలిసేలా చేశాడని పేర్కొన్నాడు. హర్భజన్ పై తనకెలాంటి కోపం లేదన్నాడు. అతడు తనకు అన్న లాంటి వాడంటూ పేర్కొన్నాడు. ఈ ఘటనపై అప్పట్లో విచారణ జరిపిన బీసీసీఐ హర్భజన్‌పై 5 వన్డేల నిషేధం విధించింది.