Why India Lost: భారత్ ఓటమికి కారణాలివే..!

అంచనాలు తలకిందులయ్యాయి... టైటిల్ గెలుస్తుందనుకున్న టీమిండియా సెమీస్‌లో బోల్తా పడింది. టోర్నీ ఆరంభం నుంచీ నిలకడగా రాణిస్తూ

  • Written By:
  • Publish Date - November 10, 2022 / 05:53 PM IST

అంచనాలు తలకిందులయ్యాయి… టైటిల్ గెలుస్తుందనుకున్న టీమిండియా సెమీస్‌లో బోల్తా పడింది. టోర్నీ ఆరంభం నుంచీ నిలకడగా రాణిస్తూ వచ్చిన బౌలర్లు కీలక మ్యాచ్‌లో చేతులెత్తేశారు. ఫలితంగా రోహిత్‌సేన పోరాటం సెమీస్‌కే పరిమితమైంది. అడిలైడ్‌లో భారత్ ఓటమికి కారణాలేంటి..

క్రికెట్‌లో ఏ ఒక్క విభాగంతోనే విజయాలు రావు.. బ్యాటింగ్‌, బౌలింగ్ ఫీల్డింగ్ అన్నింటిలోనూ సమిష్టిగా రాణిస్తేనే గెలుపు సాధ్యం…టీ ట్వంటీ ప్రపంచకప్ రెండో సెమీస్‌లో ఇది మరోసారి రుజువైంది. బ్యాటింగ్‌లో పోరాడే స్కోరు చేసిన టీమిండియా బౌలింగ్‌లో మాత్రం ఘోరంగా విఫలమయ్యింది. ఫలితంగా ఇంగ్లాండ్‌ చేతిలో చిత్తు చిత్తుగా ఓడింది. ఈ మ్యాచ్‌లో భారత ఓటమికి కారణాలు చూస్తే ఓపెనర్ల వైఫల్యం… పవర్ ప్లేలో పేలవ బ్యాటింగ్‌గా చెప్పొచ్చు. మెగా టోర్నీలో ఓపెనర్లు పెద్దగా రాణించలేదు. కెప్టెన్ రోహిత్‌ శర్మ, కెఎల్ రాహుల్ కీలక మ్యాచ్‌లలో సరైన ఆరంభానిచ్చిన దాఖలాలు లేవు. దీనికి తోడు పవర్ ప్లేలో భారత బ్యాటింగ్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. టీ ట్వంటీల్లో భారీస్కోరు చేయాలంటే పవర్ ప్లేలో వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయడం ముఖ్యం. అలాంటిది పవర్ ప్లేలో టీమిండియా దాదాపు బంతికో పరుగుకే పరిమితమైంది.

సెమీస్‌లోనూ పవర్ ప్లేలో ఎక్కువ స్కోర్ చేయకపోవడం ప్రభావం చూపింది. మరోవైపు అంచనాలు పెట్టుకున్న సూర్యకుమార్ యాదవ్ ఇంగ్లాండ్‌పై మెరుపులు మెరిపించలేకపోయాడు. ఇక సెమీస్‌లో పేలవమైన బౌలింగ్‌ టీమిండియా ఘోరపరాభవానికి ప్రధాన కారణంగా చెప్పాలి. ఏ దశలోనూ ఇంగ్లాండ్ బ్యాటర్లను మన బౌలర్లు ఇబ్బంది పెట్టలేకపోయారు. ఓపెనర్లు హేల్స్, బట్లర్ జోడీ ఆద్యంతం పవర్ ప్లేలో ఆడినట్టే రెచ్చిపోయింది. టోర్నీలో మెరుగ్గా రాణించిన పేసర్లు సెమీస్‌లో మాత్రం తేలిపోయారు. బట్లర్, హేల్స్ ఎటాకింగ్ బ్యాటింగ్‌తో చెలరేగిపోయిన వేళ మన బౌలర్లు ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు. దీంతో పవర్ ప్లేలోనే మ్యాచ్‌ ఫలితం తెలిసిపోయింది. వారిద్దరి జోరుతో ఏ దశలోనూ భారత్‌ గెలుపుపై ఆశలు లేవు. పేసర్లు, స్పిన్నర్లను ఇంగ్లాండ్ ఓపెనర్లు ఓ ఆటాడుకున్నారు.

ఎడాపెడా భారీ షాట్లతో రెచ్చిపోయారు. సీనియర్లు భువి, షమీతో పాటు అంచనాలు పెట్టుకున్న అర్షదీప్‌సింగ్ కూడా నిరాశపరిచాడు. ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయారంటే టీమిండియా బౌలింగ్ ఎంత పేలవంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద పవర్ ప్లేలో డిఫెన్సివ్ బ్యాటింగ్, పేలవమైన బౌలింగ్‌తో వరల్డ్‌కప్‌లో భారత్ సెమీస్‌లోనే ఇంటిదారి పట్టి అభిమానులను నిరాశపరిచింది.