Site icon HashtagU Telugu

Harleen Deol Asks PM Modi: ప్రధానిని ప్రశ్నించిన హర్లీన్ డియోల్.. క్వ‌శ్చ‌న్ ఏంటంటే?

Harleen Deol Asks PM Modi

Harleen Deol Asks PM Modi

Harleen Deol Asks PM Modi: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 విజేతలుగా నిలిచిన భారత మహిళా క్రికెట్ జట్టు, ప్రధాని నరేంద్ర మోదీని కలిసినప్పుడ ఆ వాతావరణం గర్వం, ఉల్లాసంతో ఉప్పొంగింది. నవంబర్ 2న దక్షిణాఫ్రికాపై విజయం సాధించి, తమ తొలి ప్రపంచ కప్ ట్రోఫీని గెలుచుకున్న హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని జట్టును ప్రధాని మోదీ ఘనంగా అభినందించారు. ఈ లాంఛనప్రాయ సంభాషణ మధ్యలో బ్యాట్స్‌మెన్ హర్లీన్ డియోల్ (Harleen Deol Asks PM Modi) అడిగిన ఒక ఊహించని ప్రశ్నతో ప్రధానమంత్రి నివాసం నవ్వులతో మారుమోగింది.

ప్రధానిని మెరుపు ప్రశ్నతో ఆశ్చర్యపరిచిన హర్లీన్

సంభాషణ సాగుతున్న సమయంలో.. ప్రధానమంత్రి మోదీ హర్లీన్ ఉత్సాహం, సానుకూల స్వభావాన్ని ప్రశంసించారు. దానికి సమాధానంగా హర్లీన్ డియోల్ వెంటనే “సర్‌, మీరు చాలా గ్లో (మెరుస్తూ) కనిపిస్తారు. మీ స్కిన్‌కేర్ రొటీన్ ఏమిటి?” అని సరదాగా ప్రశ్నించింది.

ఆ గదిలో ఉన్నవారంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు. హర్లీన్ ఈ ప్రశ్నను ప్రధాని మోదీ కూడా బాగా ఆస్వాదించారు. ఆయన కూడా చిరునవ్వుతో “నాకు ఈ విషయంపై అంతగా దృష్టి లేదు” అని అన్నారు. వెంటనే సహచర క్రీడాకారిణి స్నేహ్ రాణా జోక్యం చేసుకుని “సర్‌ ఇది దేశంలోని కోట్ల మంది ప్రజల ప్రేమ!” అని బదులివ్వగా వాతావరణం మరింత తేలికపడింది.

Also Read: T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్ 2026.. భారత్‌లోని ఈ 5 నగరాల్లోనే మ్యాచ్‌లు!

కోచ్ అమోల్ మజుందార్ చమత్కారం

జట్టు కోచ్ అమోల్ మజుందార్ కూడా ఈ సరదాలో పాలుపంచుకున్నారు. “చూడండి సర్‌ నేను ప్రతిరోజూ ఇలాంటి అల్లరి ఆటగాళ్లతోనే వ్యవహరించాల్సి వస్తుంది. అందుకే నా వెంట్రుకలు తెల్లబడ్డాయి” అని ఆయన చమత్కరించగా మరోసారి నవ్వులు వినిపించాయి.

మజుందార్ ఈ సందర్భంగా ఇంగ్లాండ్ పర్యటనకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన జ్ఞాపకాన్ని పంచుకున్నారు. కింగ్ చార్లెస్‌తో ఫోటో తీయించుకునే అవకాశం వచ్చినప్పుడు “రాజుతో ఫోటో తర్వాత, అసలైన ఫోటో ప్రపంచ కప్ గెలిచి ప్రధాని మోదీని కలిసినప్పుడే ఉంటుంది” అని జట్టు సభ్యులు సరదాగా అనుకున్నారని చెప్పారు.

కలలకు హద్దులు లేవు

జట్టు వైస్-కెప్టెన్ స్మృతి మంధాన ఈ విజయం ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. ఈ ప్రపంచ కప్ గెలుపు కేవలం ట్రోఫీ కోసం మాత్రమే కాదని, భారతదేశంలో మహిళా క్రీడల పట్ల ఆలోచనను మార్చడం దీని లక్ష్యమని ఆమె అన్నారు. వారి ఈ విజయం నిజంగా ఒక కొత్త విప్లవానికి నాంది పలికిందని, ఇప్పుడు ప్రతి చిన్న బాలికకు కలలకు హద్దులు లేవని తెలుస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలో భారత్ ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను ఓడించి తమ తొలి మహిళల వన్డే ప్రపంచ కప్‌ను గెలుచుకోవడం భారత మహిళా క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయంగా నిలిచింది. ప్రధానమంత్రి మోదీ కూడా జట్టు ఈ ఆలోచనను, ఉత్సాహాన్ని మనస్ఫూర్తిగా అభినందించారు.

Exit mobile version