Site icon HashtagU Telugu

Mohammed Siraj: ఈ జీవితం కోహ్లీ పెట్టిన భిక్ష : సిరాజ్

Virat

Virat

మహ్మద్ సిరాజ్…ప్రస్తుతం భారత్ జట్టులో కీలకమయిన పేసర్ గా తనదయిన ముద్ర వేస్తూన్నాడు. నిజానికి సిరాజ్ కెరీర్ ను ఐపీఎల్ మలుపు తిప్పింది. హైదరాబాద్ రంజీ జట్టు నుంచి సన్ రైజర్స్ కు ఎంపికైన సిరాజ్ కు అంతగా అవకాశాలు రాలేదు. వచ్చిన కొద్ది అవకాశాలను చక్కగా సద్వినియోగం చేసుకోవడం… తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అతన్ని వేలంలో కొనుగోలు చేయడం జరిగాయి. అయితే తాను ఈ స్థాయికి చేరుకోవడంలో బెంగుళూరు మాజీ కెప్టెన్ కోహ్లీ నే కారణమని ఈ హైదరాబాదీ పేసర్ ఎన్నో సార్లు చెప్పాడు. తాజాగా హిందుస్థాన్ టైమ్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరోసారి కోహ్లీ తనకు ఎలా అండగా నిలిచాడనేది చెప్పుకొచ్చాడు.

తన కెరీర్ లో 2018 ఐపీఎల్ సీజన్ అత్యంత దారుణమైన సీజన్ గా పేర్కొన్నాడు. ఆ సీజన్ లో పేలవ ప్రదర్శన కనబరచడంతో అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. ఇంకో జట్టు అయితే తనను తీసేసేదని , కోహ్లీ మద్దతుగా నిలవడంతో మరో అవకాశం వచ్చిందని చెప్పాడు. ఒక దశలో తన కెరీర్ ముగిసిందని అనుకున్నాననీ, ఆ సమయంలో కోహ్లీ తనకు అండగా నిలిచి, ఆత్మ విశ్వాసం పెరిగేలా చేశాడని గుర్తు చేసుకున్నాడు. తన సక్సెస్ క్రెడిట్ అంతా కోహ్లీకి చెందుతుందని భావోద్వేగానికి లోనయ్యాడు. ఒక్క మాటలో చెప్పాలంటే కోహ్లీ పెట్టిన బిక్షతోనే ఈ స్థాయిలో ఉన్నానని సిరాజ్ చెప్పుకొచ్చాడు.

కోహ్లీ లాంటి కెప్టెన్ బౌలర్లకు కావాలని సిరాజ్ వ్యాఖ్యానించాడు. ఒత్తిడిలో ఉన్నప్పుడు, బౌలింగ్ లైన్ తప్పినప్పుడు కోహ్లీ వైపు చూస్తే చాలని, ఎంతో బలం వస్తుందన్నాడు. కోహ్లీ దూకుడు ప్రతీ జట్టుకు అవసరం అన్నాడు. ఇక మాజీ కోచ్ రవి శాస్త్రి కూడా తన క్లిష్ట పరిస్థితుల్లో అండగా నిలిచారని సిరజ్ చెప్పాడు. తండ్రిని కోల్పోయిన తాను ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నప్పుడు రవి శాస్త్రి ఓదార్చారనీ గుర్తు చేసుకున్నాడు. ఈ టూర్ లో నువ్వు అయిదు వికెట్లు తీయాలని మీ నాన్న కోరుకున్నారంటూ రవి సర్ చెప్పిన మాటలు ఎప్పటికీ మర్చిపోలేననీ సిరాజ్ చెప్పుకొచ్చాడు. రవి శాస్త్రి సూచనతోనే స్వదేశానికి వెళ్లకుండా…ఆస్ట్రేలియా సిరీస్ లో రాణించి తండ్రికి అంకితం ఇచ్చాననీ ఈ హైదరాబాదీ పేసర్ చెప్పాడు.

Exit mobile version