Cricketer Retire Rule: 2025లో భారత క్రికెట్‌లో ఒకరి తర్వాత ఒకరుగా పలువురు దిగ్గజ క్రీడాకారులు రిటైర్మెంట్ ప్రకటించారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలకగా.. వరుణ్ ఆరోన్, పియూష్ చావ్లా కూడా తమ కెరీర్‌కు ముగింపు పలికారు. ఇటీవలనే చతేశ్వర్ పుజారా కూడా తన టెస్ట్ క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలికారు. ఇలా ఆటగాళ్ళు అకస్మాత్తుగా రిటైర్మెంట్ ప్రకటిస్తారా లేదా దీనికంటూ ఒక ప్రత్యేక ప్రక్రియ ఉంటుందా అనే సందేహం చాలా మందికి కలుగుతుంది.
క్రికెటర్లు ఎలా రిటైర్ అవుతారు?
ఏ భారత క్రికెటర్ అయినా రిటైర్మెంట్ తీసుకోవాలనుకుంటే ముందుగా అతను భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి దాని గురించి తెలియజేయాలి. అంతేకాకుండా ఆటగాడు తన నిర్ణయం గురించి జట్టు యాజమాన్యానికి, ప్రధాన కోచ్‌కు కూడా సమాచారం ఇవ్వాలి. చాలా సందర్భాలలో క్రికెటర్లు నేరుగా ప్రధాన సెలెక్టర్‌ను సంప్రదించి, తమ రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడిస్తారు. అయితే ఈ సమాచారం ప్రధాన సెలెక్టర్‌కు మాత్రమే ఇవ్వాలని తప్పనిసరి లేదు. కానీ బోర్డుకు మాత్రం తెలియజేయడం తప్పనిసరి.
Also Read: Trump Extra Tariff: ఏఏ భారత్ వస్తువులపై అమెరికా అదనపు సుంకం మినహాయింపు ఉంది?
రిటైర్మెంట్ వ్యక్తిగత నిర్ణయం
ఒక క్రికెటర్ రిటైర్మెంట్ నిర్ణయం పూర్తిగా అతని వ్యక్తిగతం. ఏ కోచ్, సిబ్బంది లేదా BCCI అధికారి కూడా ఆటగాడిని రిటైర్ అవ్వమని బలవంతం చేయలేరు. ఆటగాళ్లు తమ రిటైర్మెంట్ గురించి వివిధ రకాలుగా ప్రకటించవచ్చు. ఇటీవల చతేశ్వర్ పుజారా సోషల్ మీడియా ద్వారా తన రిటైర్మెంట్ గురించి తెలియజేశారు. అతని కంటే ముందు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా టెస్టు క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటనను సోషల్ మీడియా వేదికగా చేశారు. దీనితో పాటుగా ఆటగాళ్లు ఒక పత్రికా సమావేశం (ప్రెస్ కాన్ఫరెన్స్)లో కూడా తమ రిటైర్మెంట్‌ను ప్రకటించవచ్చు. ఉదాహరణకు రవిచంద్రన్ అశ్విన్ ఆస్ట్రేలియా పర్యటనలో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్‌లో తన రిటైర్మెంట్‌ను ధ్రువీకరించారు.