Site icon HashtagU Telugu

FIFA Suspension: భారత్ ఫుట్‌బాల్ కొంపముంచిన పాలిటిక్స్‌

Fifa

Fifa

భారత ఫుట్‌బాల్‌ భవిష్యత్తు ప్రమాదంలో పడిందా… క్రీడాసమాఖ్యల్లో తమ ఆధిపత్య ధోరణితో రాజకీయ నాయకులు ప్లేయర్స్ కెరీర్‌నే నాశనం చేస్తున్నారా…? అంటే అవుననే అనాల్సి వస్తోంది. ఏఐఎఫ్‌ఎఫ్‌లో ప్రఫుల్ పటేల్ నిర్వాకంతో ఇప్పుడు నిషేధాన్ని ఎదుర్కోవాల్సి వస్తోంది.

ఈ నిషేధంతో అండర్ 17 వరల్డ్ కప్‌ ఆతిథ్యం కూడా చేజారిపోయే పరిస్థితి ఏర్పడింది. క్రీడాసమాఖ్యల్లో రాజకీయ నాయకుల ఆధిపత్యం, అతి జోక్యం ఎప్పటికైనా ప్రమాదమేనని మరోసారి రుజువైంది. భారత్‌తో పాటు పలు దేశాల్లో క్రీడాసమాఖ్యలకు సంబంధించి రాజకీయ నాయకుల ఆధిపత్యమే కొనసాగుతూ ఉంటుంది. ఆయా దేశాల వరకూ ఇది ఆమోదయోగమైనప్పటకీ.. అంతర్జాతీయ స్థాయిలో మాత్రం అంగీకరించే పరిస్థితి ఉండదు. గతంలో భారత ఒలింపిక్ సంఘం, మరికొన్ని క్రీడాసంఘాల్లో ఇటువంటి పరిస్థితి తలెత్తినప్పుడు నిషేధాలు ఎదుర్కొన్న సందర్భాలున్నాయి.

ఈ జాబితాలో ఇప్పుడు భారత ఫుట్‌బాల్ సమాఖ్య కూడా చేరింది. ఏఐఎఫ్‌ఎఫ్‌లో బయటి వ్యక్తుల ప్రమేయం ఎక్కువైపోయిన నేపథ్యంలో ఫిఫా భారత ఫుట్‌బాల్ సమాఖ్యను సస్పెండ్ చేసింది. గత కొంత కాలంగా సరైన కార్యవర్గం లేకపోవడం, ఆటకు సంబంధం లేని వ్యక్తుల జోక్యం ఉందని గుర్తించిన ఫిఫా ఈ నిర్ణయం తీసుకుంది. నిజానికి ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ సుదీర్ఘ కాలంగా ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్‌లో ఆధిపత్యం కొనసాగిస్తున్నారు. నిబంధనల ప్రకారం 2020 డిసెంబర్‌తో మూడు దఫాలు ప్రెసిడెంట్‌గా పూర్తి చేసుకున్న ప్రఫుల్ పటేల్ ఆ తర్వాత కూడా సమాఖ్యను వీడలేదు. దీంతో సమాఖ్యలోని కొందరు సభ్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

అయినప్పటకీ పలు కారణాలతో ఏఐఎఫ్‌ఎఫ్‌ ఎన్నికలు జరగలేదు. దీంతో పలుసార్లు ఫిఫా హెచ్చరించినా ఫలితం లేకపోయింది. మూడు నెలల క్రితం ఫ్రఫుల్ పటేల్‌తో పాటు అతని కార్యవర్గాన్ని బయటకు పంపింది. తాత్కాలికంగా సమాఖ్యను నడిపించేందుకు ఒక కమిటీతో పాటు ఎన్నికలు నిర్వహించేందుకు మరో కమిటీకి బాధ్యతలు అప్పగించింది. ఎన్నికల తేదీ, విధివిధానాలు వంటి వాటిపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడుతూ వస్తోంది. ఈ సారి ప్రెసిడెంట్‌గానూ కొందరు రాజకీయ నాయకుల పేర్లే తెరపైకి రావడంతో మొత్తం పరిణామాలు గమనించిన ఫిఫా నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఏ దేశానికి చెందిన ఫుట్‌బాల్ సమాఖ్య అయినా సరైన కార్యవర్గంతో నిబంధనలకు అనుగుణంగా నడవకుంటే నిషేధం విధిస్తుంది. కాగా ఫిఫా నిర్ణయం అక్టోబర్‌లో భారత్‌ వేదికగా జరగనున్న అండర్ 17 మహిళల ప్రపంచకప్‌ నిర్వహణ ప్రమాదంలో పడింది. త్వరగా సమస్యను పరిష్కరించకోకుంటే ఆతిథ్య హక్కులు కోల్పోవడం ఖాయం. అంతే కాదు సస్పెన్షన్ ఉన్నంత కాలం అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడలేదు. దీంతో సుప్రీంకోర్టు ఈ సమస్య పరిష్కారం దిశగా తీర్పునిస్తుందని క్రీడాభిమానులు ఆకాంక్షిస్తున్నారు.