Site icon HashtagU Telugu

Shikhar Dhawan Statement: మా ఓటమికి కారణం అదే : ధావన్

Dhawan

Dhawan

సౌతాఫ్రికాతో తొలి వన్డేలో ప్రణాళికలకు తగ్గట్టు ఆడలేకపోవడం వల్లనే ఓడిపోయామన్నాడు భారత కెప్టెన్ శిఖర్ ధావన్. చివరి వరకూ పోరాడడం సంతోషాన్నిచ్చినా డెత్ ఓవర్లలో బౌలింగ్ వైఫల్యం ఓటమికి కారణమన్నాడు. ఆటగాళ్ల పోరాటం పట్ల గర్వపడుతున్నాననీ,తాము మంచి ఆరంభం అందుకోలేదన్నాడు. అయినా శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, శార్దూల్ ఠాకూర్ అద్భుత బ్యాటింగ్‌తో లక్ష్యానికి చేరువగా తీసుకెళ్లారన్నాడు. బౌలింగ్‌కు అనుకూలమైన ఈ పిచ్‌పై తాము ధారళంగా పరుగులిచ్చామని అసంతృప్తి వ్యక్తం చేశాడు. దానికితోడు చెత్త ఫీల్డింగ్ కూడా తమ ఓటమిని శాసించిందన్నాడు. అయితే ఈ ఓటమి తమకు ఓ గుణపాఠంలాంటిదని గబ్బర్ చెప్పుకొచ్చాడు. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో 9 పరుగుల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. కీలక ఆటగాళ్ళు టీ ట్వంటీ వరల్డ్‌కప్ కోసం ఆస్ట్రేలియా వెళ్ళిపోవడంతో పలువురు యువ ఆటగాళ్ళతో బరిలోకి దిగిన భారత్ చివరి వరకూ పోరాడి ఓడింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 40 ఓవర్లకు కుదించారు. మొదట దక్షిణాఫ్రికా 40 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది.

సఫారీ ఓపెనర్లు డికాక్‌ 54 బంతుల్లో 48, మలాన్‌తో కలిసి మంచి ఆరంభాన్నిచ్చాడు. తర్వాత వరుస వికెట్లు కోల్పోయినా క్లాసెన్‌ 65 బంతుల్లో 74 డేవిడ్‌ మిల్లర్‌ 63 బంతుల్లో 75 ఇద్దరూ అర్ధ సెంచరీలతో రాణించారు. ఛేజింగ్‌లో భారత్ ఆరంభం చూస్తే అసలు కనీస పోటీ కూడా ఇచ్చేలా కనిపించలేదు. సింగిల్స్‌ తీసేందుకు కూడా బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. 59 పరుగులకే 4 కీలక వికెట్లు చేజార్చుకుంది. ఈ దశలో శ్రేయస్‌ అయ్యర్ 37 బంతుల్లో 8 ఫోర్లతో 50, శార్దూల్‌ ఠాకూర్‌ 31 బంతుల్లో 5 ఫోర్లతో 33లతో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పారు. అటు వికెట్ కీపర్ సంజు శాంసన్‌ 63 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 86 రన్స్ చేసి జట్టును విజయానికి చేరువ చేశాడు. ఆఖర్లో వరుసగా వికెట్లు పడడం, బంతులు వృథా కావడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. ఆఖరి ఓవర్లో 31 పరుగులు కావాల్సివుండగా, సంజూ వరుసగా 6, 4, 4 బాదినా తర్వాత భారీ షాట్లు ఆడలేకపోవడంతో భారత్ విజయానికి 9 రన్స్ దూరంలో నిలిచిపోయింది.

Exit mobile version