Site icon HashtagU Telugu

WCL 2025 Final: వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 విజేత‌గా సౌతాఫ్రికా!

WCL 2025 Final

WCL 2025 Final

WCL 2025 Final: వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 ఫైనల్ (WCL 2025 Final) మ్యాచ్‌లో పాకిస్తాన్ ఛాంపియన్స్, సౌతాఫ్రికా ఛాంపియన్స్ జట్లు తలపడ్డాయి. ఈ ఫైనల్‌లో ఏబీ డివిలియర్స్ నేతృత్వంలోని సౌతాఫ్రికా ఛాంపియన్స్, మహమ్మద్ హఫీజ్ సారథ్యంలోని పాకిస్తాన్ ఛాంపియన్స్‌ను 9 వికెట్ల తేడాతో ఓడించి తొలిసారిగా ఈ ట్రోఫీని గెలుచుకుంది. పాకిస్తాన్ జట్టు మాత్రం రెండోసారి ఫైనల్‌లో ఓడిపోయింది.

పాకిస్తాన్ ఛాంపియన్స్ ఇన్నింగ్స్

టాస్ గెలిచిన పాకిస్తాన్ జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ షర్జీల్ ఖాన్ 76 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అయితే, మరో ఓపెనర్ కమ్రాన్ అక్మల్ కేవలం 2 పరుగులకే వెనుతిరిగాడు. తర్వాత వచ్చిన కెప్టెన్ మహమ్మద్ హఫీజ్ 17 పరుగులు, షోయబ్ మాలిక్ 20 పరుగులు చేశారు. చివరి ఓవర్లలో ఉమర్ అమీన్ 36 పరుగులు, ఆసిఫ్ అలీ 28 పరుగులు చేయడంతో పాకిస్తాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 195 పరుగుల భారీ స్కోరు సాధించింది. సౌతాఫ్రికా బౌలర్లలో హార్డస్ విల్జోయెన్, వేన్ పార్నెల్ చెరో 2 వికెట్లు తీసుకోగా, డుయాన్ ఒలివియర్ ఒక వికెట్ పడగొట్టాడు.

Also Read: AP DSC 2025 : ఏపీ మెగా డీఎస్సీ అభ్యర్ధులకు కీలక అప్డేట్‌..ఫలితాలు ఎప్పుడంటే..?

సౌతాఫ్రికా ఛాంపియన్స్ ఇన్నింగ్స్

196 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా ఛాంపియన్స్ జట్టుకు ఓపెనర్ హషీమ్ ఆమ్లా 18 పరుగులు చేసి అవుటయ్యాడు. కానీ, అతని సహ ఆటగాడు ఏబీ డివిలియర్స్ మాత్రం వీరవిహారం చేశాడు. కేవలం 60 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సర్లతో 120 పరుగుల అజేయమైన ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయపథంలో నడిపించాడు. నంబర్ 3లో బ్యాటింగ్‌కు వచ్చిన జేపీ డుమినీ కూడా 28 బంతుల్లో 50 పరుగులు చేసి డివిలియర్స్‌కు అండగా నిలిచాడు. ఈ ఇద్దరి అద్భుతమైన బ్యాటింగ్‌తో సౌతాఫ్రికా ఛాంపియన్స్ కేవలం 16.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో సౌతాఫ్రికా జట్టు తొలిసారిగా ఛాంపియన్‌గా అవతరించింది.