దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు ముందు భారత్‌కు షాక్ తగిలింది. స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ కరోనా బారిన పడ్డాడు. ప్రస్తుతం ముంబైలో ఉన్న వాష్టింగ్టన్ సుందర్ బుధవారం భారత వన్డే జట్టుకు ఎంపికైన ఆటగాళ్లతో కలిసి కేప్‌టౌన్ బయలుదేరాల్సి ఉంది. అయితే తాజాగా నిర్వహించిన పరీక్షల్లో అతనికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో సుందర్‌ను ప్రత్యేక ఐసోలేషన్‌కు తరలించారు. అతనితో సన్నిహితంగా ఉన్న మిగిలిన ఆటగాళ్ళకు కూడా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఒకవేళ ఎవరికైన కోవిడ్ పాజిటివ్‌గా తేలితే సౌతాఫ్రికా పంపించే అవకాశం లేదు. ప్రస్తుతం సుందర్ వన్డే సిరీస్‌లో ఆడే అవకాశం లేదని బోర్డు వర్గాల సమాచారం. షెడ్యూల్ ప్రకారం బెంగళూరు ఎన్‌సిఎలో ట్రైనింగ్ తీసుకుంటున్న ధావన్, చాహల్, భువనేశ్వర్ వంటి ప్లేయర్స్ అందరూ రేపు ముంబై చేరుకోనుండగా.. ఈ లోపే సుందర్‌కు పాజిటివ్‌గా తేలడం కలకలం రేపుతోంది.
ప్రస్తుతానికి సుందర్ స్థానంలో బీసీసీఐ సెలక్టర్లు ఇంకా ఎవరినీ ఎంపిక చేయలేదు. ఈ యువ స్పిన్నర్ గాయంతో దాదాపు 10 నెలలుగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమయ్యాడు. ఇటీవలే విజయ్ హజారే టోర్నీలో తమిళనాడు తరపున బరిలోకి దిగి సత్తా చాటడంతో సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు ఎంపికయ్యాడు. మళ్లీ కోవిడ్ బారిన పడడంతో సుందర్ నిరాశకు గురయ్యాడు. ఇదిలా ఉంటే బీసీసీఐ ప్రెసిడెంట్ గంగూలీ, సెక్రటరీ జైషాతో సహా పలువురు సీనియర్ అధికారులు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్‌లో బిజీగా ఉండడంతో సుందర్ స్థానంలో మరో ఆటగాడి ఎంపిక ఆలస్యం కానుంది. దక్షిణాఫ్రికాతో భారత్ మూడు వన్డేల సిరీస్ జనవరి 19 నుండి ప్రారంభం కానుంది. తొలి రెండు వన్డేలు పార్ల్‌లో జరగనుండగా.. మూడో మ్యాచ్‌కు కేప్‌టౌన్ ఆతిథ్యమిస్తోంది. వన్డే సిరీస్‌లో భారత జట్టుకు కెఎల్ రాహుల్ సారథ్యం వహించనున్నాడు.