టీ ట్వంటీ వరల్డ్ కప్ కు ముందు భారత్ ను గాయాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికే బూమ్రా, జడేజా గాయాలతో దూరమవగా.. షమి, ఉమేశ్ యాదవ్, అర్ష దీప్ సింగ్ కు ఫిట్ నెస్ సమస్యలు వెంటాడుతున్నాయి. తాజాగా సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ ఆడుతున్న దీపక్ చాహర్ గాయంతో వైదొలిగాడు. బ్యాక్ స్టిఫ్ నెస్ కారణంగా అతను జట్టుకు దూరమయ్యాడు. అతని స్థానంలో స్పిన్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ కు చోటు దక్కింది. ఇప్పటికే ఈ సిరీస్‌లో భారత్ 0-1తో వెనుకబడి ఉంది. రెండో వన్డేలో గెలిస్తేనే భారత్ సిరీస్ నిలుపుకోగలుగుతుంది. కాగా దీపక్ చాహర్ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ కి రిహబిలేషన్ కోసం వెళ్లనున్నాడు.
అక్కడ కోలుకుంటే అతను రిజర్వ్ ప్లేయర్‌గా టీ20 ప్రపంచకప్ కోసం షమీతో పాటు ఆసీస్ వెళ్లే అవకాశముంది. దీపక్ చాహర్ కోలుకోకుంటే మాత్రం టీ20 ప్రపంచకప్ స్టాండ్ బై ప్లేయర్ లిస్టు నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. . ఇదిలా ఉటే మిగిలిన రెండు వన్డేలు రాంచీ, ఢిల్లీ వేదికల్లో జరగనున్నాయి. ఆదివారం రాంచీలోనూ, 11న ఢిల్లీ వేదికగా మ్యాచ్ లు ఆడనున్న భారత్ జట్టులో వాషింగ్టన్ సుందర్ చోటు దక్కించుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు టీ ట్వంటీ ప్రపంచకప్ కోసం ఇప్పటికే ఆస్ట్రేలియా చేరుకున్న టీమిండియా ప్రాక్టీస్ ప్రారంభించింది. ప్రధాన టోర్నీ కంటే ముందు రోహిత్ సేన వార్మప్ మ్యాచ్ లు ఆడనుంది.