Site icon HashtagU Telugu

Ashes 2023: బెయిర్ స్టో స్టంపౌట్ వివాదం…ఔటా ? నాటౌటా ?

Ashes 2023

New Web Story Copy 2023 07 03t125138.192

Ashes 2023: స్లెడ్జింగ్ కు కేరాఫ్ అడ్రస్ గా ఉండే ఆస్ట్రేలియా జట్టు క్రీడాస్ఫూర్తి పాటించరనేది చాలా సార్లు రుజువైంది. ఔట్ కాదని తెలిసినా పదే పదే అప్పీల్ చేయడం, బ్యాటర్ల ఏకాగ్రత దెబ్బతీసేందుకు మాటల యుద్ధాన్ని మొదలుపెట్టడం.. ఇలాంటి చేష్టలు ఆసీస్ క్రికెటర్లకు మామూలే. బాల్ ట్యాంపరింగ్ వివాదం తర్వాత ఆసీస్ ప్రవర్తన మారిందని చాలా మంది అనుకున్నారు. అయితే తాము పాత ఆసీస్ ఆటగాళ్ళమేనంటూ కంగారూలు అప్పుడప్పుడూ నిరూపించుకుంటున్నారు. తాజాగా లార్డ్స్ వేదికగా జరిగిన యాషెస్ సిరీస్ రెండో టెస్ట్ చివరిరోజు ఆటలో బెయిర్ స్టో స్టంపౌట్ తీవ్ర చర్చనీయాంశమైంది. అతన్ని ఔట్ చేసిన తీరు క్రీడాస్పూర్తి విరుద్ధంగా ఉందన్న వాదన వినిపిస్తోంది.

లంచ్‌ ముందు ఈ ఘటన జరిగింది. గ్రీన్‌ వేసిన 52వ ఓవర్ చివరి బంతిని ఆడకుండా కిందకు వంగిన బెయిర్‌స్టో ఆ తర్వాత సహచరుడు స్టోక్స్‌తో మాట్లాడేందుకు ముందుకు వెళ్లాడు. అదే సమయంలో బంతిని అందుకున్న కీపర్‌ క్యారీ అండర్‌ఆర్మ్‌ త్రోతో ముందుకు విసరగా అది స్టంప్స్‌ను తాకింది. దీనిపై ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్ ను సంప్రదించగా..ఆ సమయంలో బెయిర్‌స్టో క్రీజ్‌కు చాలా దూరం ఉండటంతో థర్డ్‌ అంపైర్‌ బెయిర్‌స్టోన్‌ను అవుట్‌గా ప్రకటించాడు. దాంతో ఇంగ్లండ్‌ బృందం షాక్ కు గురైంది. స్టోక్స్ ఆసీస్ క్రికెటర్లతో మాట్లాడినా ఆ జట్టు తమ అప్పీల్‌ను కూడా వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయకపోవడంతో బెయిర్‌స్టో మైదానం వీడాడు. ఆ సమయంలో స్టేడియం మొత్తం పాత ఆ్రస్టేలియా…ఎప్పటిలాగే మోసగాళ్లు అంటూ ప్రేక్షకులంతా గేలి చేశారు.

ప్రస్తుతం బెయిర్ స్టో స్టంపౌట్ పై క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నిబంధనల ప్రకారం చూస్తే బెయిర్‌స్టో అవుట్‌లో తప్పు లేదనీ, బంతి ఇంకా డెడ్‌ కాకముందే అతను క్రీజ్‌ వీడాడనీ విశ్లేషకులు చెబుతున్నారు. బయటకు వెళ్లే ముందు అతను తన కాలితో క్రీజ్‌ లోపల నేలను గీకడం కూడా కనిపించినా బంతి కీపర్‌ చేతుల్లోనే ఉందని, అప్రమత్తంగా ఉన్న క్యారీ స్టంప్‌ చేశాడని విశ్లేషిస్తున్నారు. అయితే ఆసీస్ క్రికెటర్లు క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాల్సి ఉండాల్సిందన్న వాదన వినిపించింది. దీనిపై కామెంటేటర్ ప్యానెల్ లోనూ చాలా సేపు చర్చ జరగ్గా.. కొందరు ఆసీస్ కు, మరికొందరు ఇంగ్లాండ్ కు మద్ధతుగా నిలిచారు.

Read More: BoyapatiRAPO: అప్ డేట్ అదిరింది, బోయపాటి-రామ్ మాస్ సినిమా పేరు ‘స్కంధ’