Warner@200: వార్నర్ డబుల్ సెంచరీ.. ఆసీస్ కు భారీ ఆధిక్యం

డేవిడ్ వార్నర్ డబుల్ సెంచరీతో అదరగొట్టాడు.

  • Written By:
  • Updated On - December 27, 2022 / 02:57 PM IST

సౌతాఫ్రికాతో (South Africa) జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా  పట్టుబిగించింది. సఫారీలను 189 పరుగులకే ఆలౌట్ చేసిన ఆతిథ్య జట్టు బ్యాటింగ్ లో సత్తా చాటింది. చాలా కాలం తర్వాత ఫామ్ లోకి వచ్చిన ఓపెనర్ డేవిడ్ వార్నర్ (Warner) డబుల్ సెంచరీతో చెలరేగిపోయాడు. ఫలితంగా ఆసీస్ భారీ ఆధిక్యాన్ని అందుకుంది. ఆరంభంలోనే ఖవాజా, లబూషేన్ వికెట్లు చేజార్చుకున్న ఆసీస్ ను వార్నర్ ఆదుకున్నాడు. మూడో వికెట్ కు స్మిత్ తో కలిసి 229 పరుగుల పార్టనర్ షిప్ నెలకొల్పాడు. ఈ క్రమంలో సెంచరీ సాధించిన వార్నర్ తర్వాత మరింత జోష్ లో ఆడాడు. దాదాపు 1086 రోజుల తర్వాత వార్నర్ శతకం సాధించాడు. స్మిత్ కూడా హాఫ్ సెంచరీ సాధించాడు.

సఫారీ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం కనబరిచిన వార్నర్ 254 బంతుల్లో 16 ఫోర్లు,2 సిక్సర్లతో 200 పరుగులు చేసాడు. డబుల్ సెంచరీ (Double Century) చేసిన తర్వాత తన సిగ్నేచర్ మూమెంట్ తో గాల్లోకి ఎగిరిన వార్నర్ కు కాలు పట్టేసింది. దీంతో రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. తర్వాత స్మిత్ 85 రన్స్ కు ఔటవగా… ట్రావిస్ హెడ్ ఇన్నింగ్స్ కొనసాగించాడు. చివర్లో కామెరూన్ గ్రీన్ కూడా రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరగడంతో రెండోరోజు ఆట ముగిసింది. ఆస్ట్రేలియా 3 వికెట్లకు 386 పరుగులు చేసింది. క్రీజులో హెడ్ 48 పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు. ప్రస్తుతం ఆసీస్ 197 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. మూడోరోజు వేగంగా పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసే అవకాశముంది. ఈ మ్యాచ్ లో ఓటమి తప్పించుకోవాలంటే రెండో ఇన్నింగ్స్ లో సౌతాఫ్రికా బ్యాటర్లు అంచనాలకు మించి రాణించాలి.