Site icon HashtagU Telugu

Saleem Malik: పుస్తకం అమ్ముకునేందుకే ఈ చీప్ ట్రిక్స్: సలీమ్‌ మాలిక్‌

Cropped

Cropped

పాక్ క్రికెట్ లో వసీం అక్రమ్ వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం సృష్టిస్తున్నాయి. విదేశీ టూర్లకు వెళ్లినప్పుడు సలీమ్‌ మాలిక్‌ తనను ఒక పనివాడిలా చూసేవాడని.. బట్టలు ఉతికేంచేవాడని.. అవసరమైనప్పుడల్లా మసాజ్‌ చేయించుకునేవాడంటూ పాక్ క్రికెట్ దిగ్గజం వసీం అక్రమ్ వ్యాఖ్యానించాడు. తన ఆటోబయోగ్రఫీ సుల్తాన్‌ ఏ మొమొయిర్‌ ద్వారా వరుసగా ఈ సంచలన విషయాలు వెల్లడిస్తున్నాడు. అయితే తాజాగా అక్రమ్‌ వ్యాఖ్యలపై సలీమ్‌ మాలిక్‌ ఘాటుగా స్పందించాడు. అక్రమ్‌ చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదన్నాడు.

అప్పట్లో తాము ఏ టూర్‌కు వెళ్లినా అక్కడ లాండ్రీ మెషిన్‌లు ఉన్నాయన్నాడు. తమ బట్టలు అందులో వేసేవాళ్లం తప్ప ఎవరు ఉతుక్కునేవాళ్లం కాదనీ చెప్పాడు. అక్రమ్‌ స్వార్థపరుడనీ, కేవలం పబ్లిసిటీ కోసమే ఇదంతా చేస్తున్నాడనీ సలీమ్ మాలిక్ విమర్శించాడు. తనను తాను అవమానించుకుంటున్నట్లు అతనికి అర్థమవడం లేదనీ, అయినా అక్రమ్‌ వ్యాఖ్యలపై ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం తనకు లేదన్నాడు.

తన పుస్తకం అమ్ముకునేందుకు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నాడని సలీం మాలిక్ మండిపడ్డాడు. కాగా సలీమ్‌ మాలిక్‌ పాకిస్తాన్‌ క్రికెట్‌లో ఎంట్రీ ఇచ్చిన రెండేళ్ల తర్వాత 1984లో వసీమ్‌ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. మాలిక్‌ కెప్టెన్సీలో 1992-1995 మధ్య అక్రమ్‌ 12 టెస్టులు, 34 వన్డేలు ఆడాడు. ఆ తర్వాత మాలిక్ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు నేరం రుజువు కావడంతో అతనిపై జీవితకాలం నిషేధం పడింది.