Site icon HashtagU Telugu

BCCI Office: బీసీసీఐ కార్యాల‌యంలో దొంగ‌త‌నం.. రూ. 6 ల‌క్ష‌ల విలువైన జెర్సీలు మాయం!

Sports Governance Bill

Sports Governance Bill

BCCI Office: ఐపీఎల్ 2025 సీజన్ ముగిసిన తర్వాత భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI Office) కార్యాలయంలో జరిగిన ఒక దొంగతనం సంచలనం సృష్టించింది. ఏకంగా రూ. 6.52 లక్షల విలువైన జెర్సీలు అదృశ్యమవడం బీసీసీఐలో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరిపి, చివరకు నిందితుడిని అరెస్టు చేశారు.

దొంగతనానికి పాల్పడిన వాంఖడే సెక్యూరిటీ మేనేజర్

ఈ కేసులో ముంబై పోలీసులు తమ విచారణను పూర్తి చేసి, దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని గుర్తించారు. నిందితుడు మరెవరో కాదు వాంఖడే స్టేడియం సెక్యూరిటీ మేనేజర్‌గా పనిచేస్తున్న ఫారూఖ్ అస్లం ఖాన్. ముంబైలోని మీరా రోడ్‌కు చెందిన 44 ఏళ్ల అస్లం ఖాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. చర్చ్‌గేట్‌లోని వాంఖడే స్టేడియంలో ఉన్న బీసీసీఐ కార్యాలయంలోని స్టోర్ రూమ్ నుంచి ఐపీఎల్ జెర్సీలతో నిండిన ఒక పెద్ద కార్టన్‌ను అస్లం ఖాన్ దొంగిలించినట్లు పోలీసులు నిర్ధారించారు.

Also Read: India-US Trade Deal: భార‌త్‌పై ట్రంప్ 25 శాతం టారిఫ్‌.. ప్రధాన కార‌ణాలివే!

ఎలా బయటపడింది?

ఐపీఎల్ ముగిసిన తర్వాత బీసీసీఐ అధికారులు స్టోర్ రూమ్‌లోని జెర్సీల స్టాక్‌ను తనిఖీ చేసినప్పుడు ఈ దొంగతనం వెలుగులోకి వచ్చింది. ఒక్కో జెర్సీ ధర రూ. 2500 కావడంతో, మొత్తం 261 జెర్సీలు అదృశ్యమయ్యాయి. దీంతో మొత్తం నష్టం రూ. 6.52 లక్షలుగా తేలింది. వెంటనే అధికారులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. జూన్ 13న అస్లం ఖాన్ ఒక పెద్ద బాక్స్‌ను స్టోర్ రూమ్ నుంచి తీసుకెళ్తున్నట్లు ఆ ఫుటేజీలో స్పష్టంగా కనిపించింది. దీంతో బీసీసీఐ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు చేసింది.

జెర్సీలు ఎక్కడికి వెళ్ళాయి?

పోలీసుల విచారణలో అస్లం ఖాన్ దొంగిలించిన జెర్సీలను హర్యానాకు చెందిన ఒక డీలర్‌కు విక్రయించినట్లు తేలింది. కార్యాలయ నవీకరణ (రినోవేషన్) పనులు జరుగుతున్నాయని సాకుగా చెప్పి, స్టోర్ రూమ్‌లోకి ప్రవేశించి ఈ పని చేశాడు. అస్లం ఖాన్‌పై 306 కింద కేసు నమోదు చేశారు. ఒక పెద్ద సంస్థలో పనిచేస్తూ విశ్వాసానికి ద్రోహం చేసి దొంగతనానికి పాల్పడటం ఈ కేసులోని ఆశ్చర్యకరమైన విషయం. ఈ ఘటన బీసీసీఐలో భద్రతా లోపాలపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతోంది.