Deepak Hooda: హుడా ఖాతాలో అరుదైన రికార్డ్

భారత క్రికెటర్ దీపక్ హుడా అంతర్జాతీయ క్రికెట్‌లో అరుదైన రికార్డు నెలకొల్పాడు.

  • Written By:
  • Publish Date - August 21, 2022 / 01:15 PM IST

భారత క్రికెటర్ దీపక్ హుడా అంతర్జాతీయ క్రికెట్‌లో అరుదైన రికార్డు నెలకొల్పాడు. తాను టీమిండియా తరపున ఆడిన వరుస 16 మ్యాచ్‌లలో విజయం సాధించిన ఆటగాడిగా నిలిచాడు. అదృష్టం కలిసిరాకపోవడంతో గతంలో పలుసార్లు ఐపీఎల్‌తో పాటు దేశవాళీ క్రికెట్ లో రాణించినా జాతీయ జట్టులో చోటు దక్కలేదు.

నిజానికి దీపక్ హుడా అంతర్జాతీయ క్రికెట్ లోకి ఐదేళ్ల క్రితమే అడుగుపెట్టాడు. అయితే ఒక్క సిరీస్ తోనే జట్టు నుండి వైదొలిగాడు. ఆ తర్వాత నాలుగైదేళ్ల పాటు భారత జట్టులో మళ్లీ అతడి పేరు వినిపించలేదు. ఈ ఏడాది ఐపీఎల్ లక్నో సూపర్ జెయింట్స్ కు ప్రాతినిథ్యం వహించిన దీపక్ హుడా 15 మ్యాచుల్లో 451 రన్స్ చేసి ఆకట్టుకున్నాడు.

ఈ ఆటతీరుతో మళ్ళీ జాతీయ జట్టులో చోటు దక్కింది. తన ఐపీఎల్ ఫామ్ కొనసాగిస్తూ వెస్టిండీస్ తో పాటు శ్రీలంక, ఐర్లాండ్ సిరీస్‌లలో ఆకట్టుకున్నాడు. తాజాగా జింబాబ్వే టూర్‌లో రెండో వన్డేలోనూ రాణించాడు. ఈ విజయంతోనే అరంగేట్రం చేసిన తర్వాత వరుసగా 16 మ్యాచ్ గెలుపుల్లో ఉన్న ఆటగాడిగా నిలిచాడు. క్రికెట్ ఆడుతున్న ప్రధాన దేశాల్లో ఇటువంటి రికార్డు ఏ ఆటగాడికీ దక్కలేదు. గతంలో ఈ రికార్డ్ రొమేనియా ప్లేయర్ సాట్విక్ నడిగోటియా పేరు మీద ఉంది.

నడిగోటియా అరంగేట్రం చేసిన సమయం నుండి పదిహేను మ్యాచుల్లో రొమేనియా విజయాన్ని సాధించింది. జింబాబ్వేతో జరిగిన రెండో వన్డే ద్వారా అతడి రికార్డును దీపక్ హుడా అధిగమించాడు. రెండో వన్డేలో 100 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన భారత్‌ను సంజూ శాంసన్, దీపక్ హుడా గెలిపించారు.