Asian Games 2023: టీమిండియా కోచ్ గా వీవీఎస్ లక్ష్మణ్… ఏ టోర్నీకో తెలుసా ?

ఐపీఎల్ తర్వాత దాదాపు నెలన్నర రోజుల పాటు భారత క్రికెట్ మ్యాచ్ లు లేక అభిమానులు బోర్ ఫీలయ్యారు. ఇప్పుడు విండీస్ టూర్ లో టెస్ట్ సిరీస్ సైతం వన్ సైడ్ గా జరుగుతుండడంతో

Asian Games 2023: ఐపీఎల్ తర్వాత దాదాపు నెలన్నర రోజుల పాటు భారత క్రికెట్ మ్యాచ్ లు లేక అభిమానులు బోర్ ఫీలయ్యారు. ఇప్పుడు విండీస్ టూర్ లో టెస్ట్ సిరీస్ సైతం వన్ సైడ్ గా జరుగుతుండడంతో వారికి అంత మజాగా అనిపించడం లేదు. అయితే టెస్ట్ సిరీస్ తర్వాత భారత్ నాన్ స్టాప్ క్రికెట్ ఆడనుంది. ఆసియాకప్ , ఐర్లాండ్ టూర్ , ఆసీస్ తో సిరీస్ , తర్వాత వన్డే ప్రపంచకప్ , మధ్యలో ఆసియా క్రీడలు ఇలా బిజీబిజీగా గడపనుంది. దీంతో క్రికెటర్లతో పాటు టీమిండియా కోచింగ్ స్టాఫ్ కు కూడా తీరిక దొరికే అవకాశాలు లేవు. ఈ నేపథ్యంలో కొన్ని సిరీస్ లకు కోచింగ్ స్టాఫ్ ను మార్చాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా ఆసియా క్రీడల్లో ఆడే జట్టుకు వీవీఎస్ లక్ష్మణ్ కోచ్ గా వ్యవహరించనున్నాడు. చైనా వేదికగా జరగనున్న ఆసియా క్రీడల కోసం ఇప్పటికే భారత జట్టును ప్రకటించారు. సీనియర్ క్రికెటర్లందరూ వేరే సిరీస్ లతో బిజీగా ఉండడంతో పాటు ప్రపంచకప్ సన్నాహకాల్లో నిమగ్నమవడంతో ద్వితీయ శ్రేణి జట్టును ఎంపిక చేశారు. దీనికి రుతురాజ్ గైక్వాడ్ సారథ్యం వహించనుండగా.. ఇప్పుడు కోచ్ రాహుల్ ద్రావిడ్ స్థానంలో లక్ష్మణ్ ఆసియా క్రీడల్లో కోచ్ గా వ్యవహరించనున్నాడు.

లక్ష్మణ్ ప్రస్తుతం బెంగళూరు జాతీయ క్రికెట్ అకాడమీ హెడ్ గా వ్యవహరిస్తున్నాడు. నిజానికి ద్రావిడ్ విశ్రాంతి తీసుకున్న పలు సిరీస్ లకు గతంలో లక్ష్మణ్ జట్టుకు కోచ్ గా ఉన్నాడు. యువక్రికెటర్లను పంపించే సిరీస్ లకు ద్రావిడ్ కు రెస్ట్ ఇస్తున్న బీసీసీఐ లక్ష్మణ్ వైపే మొగ్గుచూపుతోంది. ఎన్ సిఎలో ఉన్న సపోర్టింగ్ స్టాఫ్ లో మరికొందరిని కూడా అతనితో పాటు పంపించనుంది. కాగా రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలోని యంగ్ ఇండియా ఆసియా క్రీడల్లో నేరుగా క్వార్టర్ ఫైనల్ ఆడనుంది. ఈ టీమ్ లో ఐపీఎల్ లో సత్తా చాటిన పలువురు యువక్రికెటర్లు ఎంపికయ్యారు. అంతర్జాతీయ స్థాయిలో తమ సత్తా నిరూపించుకునేందుకు ఇది వీరందరికీ మంచి అవకాశంగా చెప్పొచ్చు. ఆసియా క్రీడలకు మహిళల విభాగంలో మాత్రం భారత్ పూర్తిస్థాయి జట్టునే ఎంపిక చేసింది. హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత మహిళల జట్టు కూడా ఆసియాక్రీడల్లో గోల్డ్ మెడల్ రేసులో ఉంది. ఆసియా క్రీడలు సెప్టెంబర్ 19 నుండి అక్టోబర్ 7 వరకూ చైనాలోని హాంగ్ ఝౌ వేదికగా జరగనున్నాయి. నిజానికి గత ఏడాదే ఇవి జరగాల్సి ఉన్నప్పటకీ..కరోనా కారణంగా వాయిదా పడ్డాయి.

Read More: Zimbabwe T10 League: వచ్చేసింది మరో టీ10 లీగ్