Site icon HashtagU Telugu

VVS Laxman: తాత్కాలిక హెడ్‌కోచ్‌గా వీవీఎస్‌ లక్ష్మణ్‌!

Vvs Laxman Imresizer

Vvs Laxman Imresizer

కీలకమైన ఆసియాకప్‌కు ముందు టీమిండియా హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ కోవిడ్-19 పాజిటివ్‌గా తేలిన సంగతి తెలిసిందే. దీంతో ఆసియాకప్‌ వరకు ద్రవిడ్‌ స్థానంలో తాత్కాలిక హెడ్‌కోచ్‌గా వీవీఎస్‌ లక్ష్మణ్‌ వ్యవహరించనున్నాడని సమాచారం. ప్రస్తుతానికి సహాయక కోచ్‌ పారస్‌ మాంబ్రే ఇన్‌చార్జి కోచ్‌గా వ్యవహరిస్తారు. ఎన్‌సీఏ డైరెక్టర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ను హరారే నుంచి నేరుగా అక్కడికి పంపే విషయంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
కేఎల్‌ రాహుల్‌ నేతృత్వంలో టీమిండియా జింబాబ్వేతో ఆడిన వన్డే సిరీస్‌కు లక్ష్మణ్‌ కోచ్‌గా వ్యవహరించాడు. ఆ సిరీస్‌ను టీమిండియా 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. ఎన్‌సీఏ డైరెక్టర్‌గా ఉన్న లక్ష్మణ్‌ అంతకముందు శ్రీలంక పర్యటనలోనూ కోచ్‌గా సక్సెస్‌ అయ్యాడు. అందుకే ఆసియాకప్‌ వరకు ద్రవిడ్‌ స్థానంలో అతని ఎంపికే సరైనదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.

ఇక ఆసియా కప్‌కు ఎంపికైన రోహిత్‌ శర్మ బృందంలో ముగ్గురు మినహా మెజారిటీ సభ్యులంతా మంగళవారం ఉదయం దుబాయ్‌కి పయనమయ్యారు. జింబాబ్వేలో ఉన్న వైస్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్, దీపక్‌ హుడా, రిజర్వ్‌ ప్లేయర్‌ అక్షర్‌ పటేల్‌లు హరారే నుంచే అక్కడికి బయల్దేరతారు. ఆసియా కప్‌ ప్రధాన టోర్నీ యూఏఈలో ఈనెల 27 నుంచి జరుగుతుంది. 28న జరిగే తమ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో భారత్‌ తలపడుతుంది.