IPL 2022: ధోనీ వారసుడు అతడే.. రుతురాజ్ సరైనోడు : సెహ్వాగ్

చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కాబోయే కెప్టెన్ ఎవరు ? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

  • Written By:
  • Publish Date - May 14, 2022 / 02:44 PM IST

చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కాబోయే కెప్టెన్ ఎవరు ? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కెప్టెన్సీ లో ఘోరంగా విఫలమైన రవీంద్ర జడేజా.. ఇటీవల పగ్గాలను మళ్లీ ధోనీ చేతుల్లో పెట్టాడు. అయితే ఇకపై కెప్టెన్సీ చేయాలనే ఆసక్తి ధోనీకి కూడా లేదని తెలుస్తోంది. ఈనేపథ్యంలో అందరి చూపులు చెన్నై సూపర్ కింగ్స్ కు భావి కెప్టెన్ ను వెతకడంలో నిమగ్నమయ్యాయి. ఈక్రమంలో మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీకి ఓ పేరును సూచించారు. అతడే.. చెన్నై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్. ‘ రుతురాజ్ సెంచరీ చేసినా పొంగిపోడు .. సున్నా చేసినా కుంగిపోడు. అతడు స్వీయ నియంత్రణ కలిగిన వ్యక్తి. గతంలో మహారాష్ట్ర టీమ్ కెప్టెన్ గా పనిచేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అతడు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నందున.. ఎవరికి, ఎప్పుడు బంతి ఇవ్వాలి ? బ్యాటింగ్ ఆర్డర్ లో చేయాల్సిన మార్పులు ఏంటి ? అనే అంశాలపై మంచి అవగాహన ఉంది. మంచి కెప్టెన్ అయ్యేందుకు అవసరమైన లక్షణాలు అతడిలో ఉన్నాయి’ అని సెహ్వాగ్ వ్యాఖ్యానించారు. మరో మూడు నాలుగు సీజన్లు ఆడితే గైక్వాడ్ కు కెప్టెన్సీ ఇవ్వొచ్చని సూచించాడు. అయితే గైక్వాడ్ లో ఒక్కటి తప్ప, ధోనీలోని అన్ని లక్షణాలూ ఉన్నాయని సెహ్వాగ్ అన్నాడు. గైక్వాడ్ లో లేని ఆ ఒక్క లక్షణం ఏంటని మీడియా ప్రశ్నించగా.. కచ్చితంగా చెప్పలేను కానీ, అది అదృష్టం కావచ్చన్నాడు.

బ్యాటింగ్ మెరుపుల చిరునామా అతడే..

సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఇటీవల జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్ లో 57 బంతుల్లో 6 సిక్సర్లు, 6 ఫోర్లతో 99 పరుగులు చేశాడు. ఐపీఎల్ లో సచిన్ 31 ఇన్నింగ్స్ లో 1000 పరుగులు సాధించాడు. ఇప్పుడు రుతురాజ్ గైక్వాడ్ కూడా 31 ఇన్నింగ్స్ లో 1000 పరుగులు చేశాడు. ఏప్రిల్ 17న గుజరాత్ టైటాన్స్ జట్టు తో జరిగిన మ్యాచ్ లోనూ రుతురాజ్ కేవలం 48 బంతుల్లో 73 రన్స్ చేశాడు.