Virat- Rohit Dance: ముంబైలో డ్యాన్స్ వేసిన రోహిత్‌, విరాట్‌.. ఇదిగో వీడియో..!

ముంబైలో బ‌స్ ప‌రేడ్ త‌ర్వాత వాంఖ‌డే స్టేడియం వ‌చ్చిన స‌మ‌యంలో స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీ, టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ (Virat- Rohit Dance) డ్యాన్స్ వేశారు.

  • Written By:
  • Updated On - July 4, 2024 / 10:48 PM IST

Virat- Rohit Dance: టీమిండియా టీ20 ప్రపంచ‌క‌ప్ గెలిచి ఈరోజు ఉద‌యం స్వ‌దేశానికి తిరిగి వ‌చ్చింది. స్వ‌దేశానికి వ‌చ్చిన త‌ర్వాత బిజీ షెడ్యూల్‌లో ఉన్న టీమిండియా చివ‌రగా వాంఖ‌డే స్టేడియంలో స‌న్మాన స‌భ‌తో విజ‌య వేడుక‌ల‌ను ముగించింది. అయితే ముంబైలో బ‌స్ ప‌రేడ్ త‌ర్వాత వాంఖ‌డే స్టేడియం వ‌చ్చిన స‌మ‌యంలో స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీ, టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ (Virat- Rohit Dance) అభిమానుల‌కు టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ను భార‌త్ అభిమానుల‌కు చూపుతూ చ‌క్ దే ఇండియా పాట‌కు డ్యాన్స్ వేశారు. వీరితో పాటు మిగిలిన క్రీడాకారులు కూడా ఈ పాట‌కు కాలు క‌దిపారు. ప్ర‌స్తుతం విరాట్, రోహిత్ వేసిన డ్యాన్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

టీ20 ప్రపంచకప్ 2024 టైటిల్ టీమిండియాకు చారిత్రాత్మకం. బార్బడోస్ నుండి తిరిగి వచ్చిన తర్వాత మొదట ఢిల్లీ, తరువాత ముంబై ముక్తకంఠంతో టీమిండియాకు స్వాగతం పలికాయి. రోహిత్ శర్మ సారథ్యంలో భారత జట్టు విజయోత్సవ పరేడ్ కూడా చరిత్రాత్మకంగా మారింది. ఇందులో లక్షలాది మంది అభిమానులు పాల్గొన్నారు. టీమ్ ఇండియా వాంఖడే చేరుకున్నప్పుడు అభిమానుల నినాదాల‌తో స్టేడియం మారుమోగిపోయింది. ఇక్కడ భారత జట్టు ఆటగాళ్లు జోరుగా డ్యాన్స్ చేశారు. అనంతరం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా అభిమానులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రైజ్ మనీగా టీమ్ ఇండియాకు బీసీసీఐ ప్ర‌క‌టించిన‌ రూ.125 కోట్లను కూడా అంద‌జేశారు.

ఇక‌పోతే ఐసీసీ టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024 విజేతగా టీమిండియా విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. జూన్ 29న సౌతాఫ్రికాతో జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో భార‌త్ జ‌ట్టు 7 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించి 13 ఏళ్ల త‌ర్వాత ఐసీసీ ట్రోఫీ సాధించ‌గా.. 17 ఏళ్ల త‌ర్వాత రెండోసారి ఐసీసీ టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ను గెలిచిన విష‌యం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 7 వికెట్ల న‌ష్టానికి 176 ప‌రుగులు చేయ‌గా.. ల‌క్ష్యాన్ని చేధించేందుకు బ‌రిలోకి దిగిన సౌతాఫ్రికా జ‌ట్టు కేవ‌లం 169 ప‌రుగులు మాత్ర‌మే చేసి ర‌న్న‌ర‌ప్‌గా నిలిచింది.

We’re now on WhatsApp : Click to Join