Virat Kohli: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి రెండు వన్డే ఇన్నింగ్స్‌లలో డకౌట్‌గా నిరాశపరిచినప్పటికీ విరాట్ కోహ్లీ (Virat Kohli) తన స్థాయిని, ఫామ్‌ను ఎప్పుడూ కోల్పోలేదని మరోసారి నిరూపించాడు. శనివారం సిడ్నీలో ఆస్ట్రేలియాపై జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో దిగ్గజ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ తన భాగస్వామి రోహిత్ శర్మతో కలిసి అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించి భారత్‌కు 9 వికెట్ల తేడాతో సునాయాస విజయాన్ని అందించాడు.
రో-కో సూపర్ ఇన్నింగ్స్
ఆస్ట్రేలియా నిర్దేశించిన 236 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రోహిత్ శర్మ (121 నాటౌట్), విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించారు. విరాట్ కోహ్లీ 74 పరుగులతో (నాటౌట్) నిలకడ ప్రదర్శించగా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించే సెంచరీ (121*) సాధించాడు. ఈ ఇద్దరూ కలిసి రెండో వికెట్‌కు 168 పరుగుల అభేద్య భాగస్వామ్యాన్ని నెలకొల్పడం ద్వారా భారత్‌కు విజయం పక్కా చేశారు.
వైట్-బాల్ క్రికెట్‌లో రికార్డు
తన అద్భుతమైన ఇన్నింగ్స్‌తో కోహ్లీ మరో అరుదైన రికార్డును నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో అతను తెల్ల బంతి క్రికెట్‌లో (వన్డేలు + టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు) అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. విరాట్, సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న మొత్తం 18,369 పరుగుల రికార్డును అధిగమించాడు. ఈ ప్రదర్శనతో కోహ్లీ చరిత్రలో అత్యుత్తమ వైట్-బాల్ క్రికెటర్ తానేనని మరోసారి నిరూపించుకున్నాడు.
Also Read: Retirement: వన్డే ఫార్మాట్ రిటైర్మెంట్‌పై కోహ్లీ-రోహిత్ సంచలన వ్యాఖ్యలు!
India’s 🇮🇳 flag above anything else 🫡❤️🔥
That’s our Virat Kohli 🫡#AUSvsIND— Sarcasm (@sarcastic_us) October 25, 2025
హృదయాలను హత్తుకున్న క్షణం
భారత విజయం తర్వాత మైదానం నుండి వెళ్తున్న సమయంలో ఒక చిన్న సంఘటన జరిగింది. అది భారతీయ అభిమానుల హృదయాలను హత్తుకుంది. సిడ్నీ అభిమానులతో మాట్లాడుతున్న కోహ్లీ.. ఒక భారతీయ అభిమాని జాతీయ జెండాను పొరపాటున నేల మీద పడేయడం గమనించాడు. వెంటనే కోహ్లీ ఆ జాతీయ జెండాను నేల నుండి తీసుకుని తిరిగి ఆ అభిమానికి అందించాడు. ఈ క్షణం కోహ్లీకి దేశం పట్ల, జెండా పట్ల ఉన్న గౌరవాన్ని, నిబద్ధతను చాటిచెప్పింది. క్రీజులో అతని ప్రదర్శన ఎంత గొప్పదో., ఈ సంఘటన కూడా అంతే గొప్పగా నిలిచింది.
