Site icon HashtagU Telugu

RCB beats DC: ఢిల్లీ ఐదో’సారీ”… సొంతగడ్డపై బెంగళూరు గెలుపు

PBKS vs RCB

Rcb Team

RCB vs DC: ఐపీఎల్ 16వ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. వరుసగా ఐదో మ్యాచ్‌లోనూ చిత్తుగా ఓడింది. మరోసారి ఆ జట్టు బ్యాటర్లు విఫలమైన వేళ ఛేజింగ్‌లో ఢిల్లీ కుప్పకూలింది. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 23 పరుగుల తేడాతో విజయం సాధించింది.

మొదట బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు దూకుడుగా ఆడింది. ఓపెనర్లు కోహ్లీ, డుప్లెసిస్ మంచి ఆరంభాన్నే ఇచ్చారు. తొలి వికెట్‌కు 42 పరుగులు జోడించారు. డుప్లెసిస్ 22 పరుగులకు ఔటైనప్పటకీ…కోహ్లీ తన ఫామ్ కొనసాగించాడు. 34 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్‌తో 50 పరుగులు చేశాడు. అయితే ఆ జట్టు కీలక బ్యాటర్లు అందరూ ధాటిగా ఆడే క్రమంలో వరుసగా ఔటయ్యారు. లామ్రోర్ 26 , మాక్స్‌వెల్ 24 పరుగులు చేశారు. కోహ్లీ ఔటైన తర్వాత బెంగళూరు అనుకున్నంత వేగంగా పరుగులు చేయలేకపోయింది. దినేశ్ కార్తీక్ డకౌటవడంతో 160 పరుగులకే పరిమితమయ్యేలా కనిపించింది. చివర్లో షాబాజ్ అహ్మద్ 12 బంతుల్లో 20 , అనూజ్ రావత్ 15 రన్స్ చేసారు. దీంతో ఆర్‌సీబీ 20 ఓవర్లలో 6 వికెట్లకు 174 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో మిఛెల్ మార్ష్ 2 , కుల్‌దీప్‌యాదవ్ 2 వికెట్లు పడగొట్టారు. ఒక దశలో 200కు పైగా స్కోర్ చేస్తుందనుకున్న ఆర్‌సీబీని కట్టడి చేయడంలో ఢిల్లీ సక్సెస్ అయిందనే చెప్పాలి.

175 పరుగుల లక్ష్యఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి ఓవర్ నుంచే తడబడింది. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన పృథ్వీ షా డకౌటవగా… మిఛెల్ మార్ష్ కూడా నిరాశపరిచాడు. పార్నెల్ బౌలింగ్‌లో ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాట పట్టాడు. యశ్ ధుల్1 , అభిషేక్ పోరెల్ 5 పరుగులకే ఔటయ్యారు. కాసేపటికే ఫామ్‌లో ఉన్న డేవిడ్ వార్నర్ కూడా 19 పరుగులకు ఔటయ్యాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ 30 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది.

అయితే మనీశ్ పాండే ధాటిగా ఆడుతూ స్కోర్ పెంచాడు. అక్షర్ పటేల్‌తో కలిసి కీలక పార్టనర్‌షిప్ నెలకొల్పిన పాండే 38 బంతుల్లో 5 ఫోర్లు , 1 సిక్సర్‌తో 50 పరుగులు చేశాడు. స్వల్ప వ్యవధిలో మనీశ్ పాండే, అక్షర్ పటేల్ ఔటవడంతో ఢిల్లీ ఓటమి ఖాయమైపోయింది. తర్వాత అంతగా అనుభవం లేని అమన్ హకీమ్‌ఖాన్, లలిత్ యాదవ్ కూడా నిరాశపరిచారు. చివర్లో నోర్జే 14 బంతుల్లోనే 4 ఫోర్లతో 23 పరుగులు చేసినా ఫలితం లేకపోయింది.

చివరికి ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్లకు 151 పరుగులు చేసింది. ఈ సీజన్‌లో ఢిల్లీకి ఇది ఐదో ఓటమి. బెంగళూరు బౌలర్లలో విజయ్‌కుమార్ విశాక్ 3 , సిరాజ్ 2 వికెట్లు పడగొట్టగా… పార్నెల్, హసరంగా, హర్షల్ పటేల్ ఒక్కో వికెట్ తీశారు. కాగా బెంగళూరుకు ఇది రెండో విజయం.