విజయ్ హజారే ట్రోఫీ.. యువ బౌలర్‌కు విరాట్ కోహ్లీ విలువైన సలహా!

గుజరాత్ క్రికెట్ టీమ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. కోహ్లీ 61 బంతుల్లో 77 పరుగులు (13 ఫోర్లు, 1 సిక్సర్) చేసి సెంచరీకి చేరువవుతున్న తరుణంలో విశాల్ జైస్వాల్ అతడిని పెవిలియన్‌కు పంపాడు.

Published By: HashtagU Telugu Desk
Virat Kohli

Virat Kohli

Virat Kohli: విరాట్ కోహ్లీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు ఆడారు. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ కోహ్లీ అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌పై అద్భుత శతకం బాదిన ఆయన, ఆ తర్వాత గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా శతకం దిశగా వేగంగా దూసుకెళ్లారు. అయితే ఆ సమయంలో విశాల్ జైస్వాల్ బౌలింగ్‌లో ఉర్విల్ పటేల్ కోహ్లీని స్టంప్ అవుట్ చేశాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత కోహ్లీ యువ బౌలర్ విశాల్ జైస్వాల్‌తో మాట్లాడారు. ఆ వివరాలను విశాల్ స్వయంగా వెల్లడించారు.

విశాల్ జైస్వాల్‌తో విరాట్ కోహ్లీ ఏమన్నారంటే?

గుజరాత్ క్రికెట్ టీమ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. కోహ్లీ 61 బంతుల్లో 77 పరుగులు (13 ఫోర్లు, 1 సిక్సర్) చేసి సెంచరీకి చేరువవుతున్న తరుణంలో విశాల్ జైస్వాల్ అతడిని పెవిలియన్‌కు పంపాడు. మ్యాచ్ అనంతరం కోహ్లీ తనతో మాట్లాడిన మాటలను విశాల్ టైమ్స్ ఆఫ్ ఇండియాకు వివరిస్తూ.. “నువ్వు చాలా బాగా బౌలింగ్ చేస్తున్నావు. కష్టపడటం ఆపకు. నీకు ఖచ్చితంగా అవకాశం వస్తుంది. ఓపికగా ఉండు, ప్రయత్నిస్తూనే ఉండు” అని కోహ్లీ తనను ప్రోత్సహించినట్లు తెలిపాడు. ఈ మ్యాచ్‌లో విశాల్ కేవలం కోహ్లీనే కాకుండా రిషబ్ పంత్, నితీష్ రాణా, అర్పిత్ రాణాల వికెట్లను కూడా పడగొట్టాడు.

Also Read: సరికొత్త రూపంలో టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్.. అదిరిపోయే డిజైన్, అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో ఎంట్రీ!

‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా కింగ్ కోహ్లీ

ఈ మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు 50 ఓవర్లలో 254 పరుగులు చేసింది. ఇందులో కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ చాలా కీలకం. లక్ష్య ఛేదనలో గుజరాత్ జట్టు 247 పరుగులకే ఆలౌట్ అయింది. ఢిల్లీ బౌలర్ ప్రిన్స్ యాదవ్ 8.4 ఓవర్లలో 3 వికెట్లు తీసి రాణించారు. కోహ్లీ ఆడిన అద్భుత ఇన్నింగ్స్ కారణంగా ఆయనకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. మరోవైపు విశాల్ జైస్వాల్ 10 ఓవర్లలో 42 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టారు. విరాట్ కోహ్లీ ఇకపై ఈ విజయ్ హజారే ట్రోఫీలో కొనసాగడం కష్టంగా కనిపిస్తోంది. ఆయన త్వరలోనే న్యూజిలాండ్‌తో జరగనున్న సిరీస్ కోసం భారత జట్టుతో చేరనున్నారు.

  Last Updated: 28 Dec 2025, 06:07 PM IST