Site icon HashtagU Telugu

T20 World Cup 2024: వరల్డ్ కప్ టీమ్ నుంచి కోహ్లీ ఔట్? కోహ్లీని తప్పించే యోచనలో సెలక్టర్లు

T20 World Cup 2024

T20 World Cup 2024

T20 World Cup 2024: బీసీసీఐ సంచలన నిర్ణయం దిశగా అడుగులు వెేస్తోంది. టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలవాలని పట్టుదలగా ఉన్న సెలక్టర్లు జట్టు ఎంపికలో కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు రెడీ అయ్యారు. దీనిలో భాగంగా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీని తప్పించాలని భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. వరల్డ్ కప్ కు ఆతిథ్యమివ్వనున్న కరేబియన్ , అమెరికా పిచ్ లు కోహ్లీ బ్యాటింగ్ కు సూట్ కావని సెలక్టర్లు ఈ ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. దీనిపై ప్రస్తుతం సెలక్షన్ కమిటీ చర్చించినట్టు తెలుస్తోంది. అలాగే కోహ్లీని తప్పించే విషయంలో మరోసారి కోచ్ ద్రావిడ్ తోనూ మాట్లాడాలని నిర్ణయించుకున్నట్టు కథనాలు వస్తున్నాయి. ఒకవేళ కోహ్లీని తప్పించాలని తుది నిర్ణయం తీసుకుంటే ఆ బాధ్యత అగార్కర్ కే అప్పగించాలని బీసీసీఐ డిసైడ్ అయినట్టు బోర్డు వర్గాల సమాచారం. కోహ్లీని ఒప్పించే బాధ్యత చీఫ్ సెలక్టర్ అగార్కర్ డీల్ చేసే అవకాశముంది.

గత టీ ట్వంటీ వరల్డ్ కప్ తర్వాత అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్ లో కోహ్లీ కనిపించలేదు. కేవలం వన్డేలు, టెస్టుల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. వచ్చే వరల్డ్ కప్ లో రోహిత్ , కోహ్లీ ఆడతారని ఇటీవలే వార్తలు వచ్చాయి. ఆసీస్ తో సిరీస్ కు కూడా వీరిద్దరినీ ఎంపిక చేశారు. అయితే కోహ్లీ విషయంలో మాత్రం సెలక్టర్లు పునరాలోచనలో పడినట్టు కనిపిస్తోంది. వరల్డ్ కప్ కు ఎక్కువమంది యువక్రికెటర్ల వైపే సెలక్టర్లు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. కాగా కోహ్లీ ఇప్పటి వరకూ 117 టీ ట్వంటీల్లో 4037 పరుగులు చేశాడు. దీనిలో ఒక సెంచరీ, 37 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఒకవేళ సెలక్టర్ల నిర్ణయం ఇదే అయితే కోహ్లీ ఫ్యాన్స్ కు షాకే. ఇక విరాట్ షార్ట్ ఫార్మాట్ కు సంబంధించి కేవలం ఐపీఎల్ లో మాత్రమే కనిపిస్తాడని చెప్పొచ్చు.

Also Read: TS SSC Exam 2024:10వ తరగతి పరీక్షల నేపథ్యంలో సెల్ ఫోన్లపై కఠిన ఆంక్షలు