Virat Kohli: వరల్డ్ క్రికెట్ లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంతర్జాతీయ కెరీర్ రికార్డుల రారాజుగా నిలిచాడు. ఆన్ ది ఫీల్డ్ లోనే కాదు ఆఫ్ ద ఫీల్డ్ లోనూ కోహ్లీ ఫాలోయింగ్ ఓ రేంజ్ లో ఉంటుంది. ఆసియా కప్ ముందు వరకూ పేలవ ఫామ్ తో సతమతమైనా కోహ్లీ క్రేజ్ కొంచెం కూడా తగ్గలేదు. తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు విరాట్ తీసుకుంటున్న రెమ్యునరేషనే దీనికి ఉదాహరణ. మొన్నటి వరకూ ఇన్ స్టాలో ఒక్కో పోస్టుకు 8 కోట్ల రూపాయల వరకూ తీసుకున్న కోహ్లీ ఇప్పుడు మరో కోటి పెంచాడు. ప్రస్తుతం ఇన్ స్టాలో ఒక పోస్టుకు కోహ్లీ తీసుకుంటున్న పారితోషకం 9 కోట్లకు చేరింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అత్యధిక మొత్తం ఆర్జిస్తున్న టాప్ 20 సెలబ్రిటీల్లో ఒకడిగా కోహ్లీ నిలిచాడు.
ఇన్‌స్టా ఆదాయంలో టాప్ 20లో కోహ్లీ ఒక్కడికే చోటు దక్కింది. ఇదే జాబితాలో ప్రియాంక చోప్రా 27వ స్థానంలో నిలిచింది. ఇక టాప్ 100లో ఉన్న ఒకే ఒక్క క్రికెటర్ కూడా కోహ్లీనే. కోహ్లీకి ట్విట్టర్‌లో 50.4 మిలియన్ల ఫాలోవర్లు ఫేస్‌బుక్‌లో కూడా 50 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. అటు ఇన్‌స్టాలో ఫుట్‌బాల్ లెజెండ్స్ క్రిస్టియానో రొనాల్డో, లియోనెల్ మెస్సీ తర్వాత అత్యధిక ఫాలోవర్లు కలిగిన అథ్లెట్ గానూ కోహ్లీ రికార్డులకెక్కాడు. రోనాల్డో ఒక్కో ఇన్ స్టా పోస్టుకు దాదాపు 18 కోట్లు అంటే కోహ్లీ కంటే రెట్టింపు మొత్తం తీసుకుంటున్నాడు. కాగా కోహ్లీ బీసీసీఐ కాంట్రాక్ట్, ఐపీఎల్, ఎండార్స్‌మెంట్స్ ద్వారానే గాక సోషల్ మీడియా ద్వారా కూడా కోట్లల్లో సంపాదిస్తున్నాడు.