Virat Kohli : కోహ్లీని ఊరిస్తున్న రికార్డులు

  • Written By:
  • Updated On - January 19, 2022 / 03:12 PM IST

కెప్టెన్సీ భారం దిగిపోయిన వేళ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని అంతర్జాతీయ క్రికెట్ లో మరికొన్ని అరుదైన రికార్డులు ఊరిస్తున్నాయి. అన్నీ అనుకూలిస్తే ప్రస్తుత సఫారీ సిరీస్ లోనే కోహ్లీ ఈ మైలురాళ్ళను అందుకునే అవకాశముంది. వీటిలో ముందుగా చెప్పుకోవాల్సింది అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక సెంచరీల రికార్డు గురించే. ఈ జాబితాలో కోహ్లీ మూడో స్థానంలో ఉండగా… 100 శతకాలతో సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలోనూ, 71 శతకాలతో పాంటింగ్ రెండో స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్న కోహ్లీ అంతర్జాతీయ కెరీర్ లో 70 శతకాలు సాధించాడు. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ లో కోహ్లీ మరో సెంచరీ చేస్తే పాంటింగ్ రికార్డును అధిగమిస్తాడు. పాంటింగ్ 560 మ్యాచ్ లలో 71 సెంచరీలు చేస్తే… కోహ్లీ కేవలం 448 మ్యాచ్ లలోనే 70 శతకాలు అందుకున్నాడు. దీంతో మరో శతకంతో పాంటింగ్ రికార్డును సమం చేసినా యావరేజ్ పరంగా అతన్ని అధిగమిస్తాడు.

నిజానికి చాలా కాలంగా ఫామ్ కోల్పోవడంతో కోహ్లీ పలు రికార్డులను మరింత త్వరగా సాధించే అవకాశం కోల్పోయాడు. కోహ్లీ శతకం సాధించి రెండేళ్ళకు పైగా దాటిపోయింది. సౌతాఫ్రికాతో మూడో టెస్టులో రాణించినా 79 పరుగులకే ఔటయ్యాడు. కాగా వన్డేల్లో అత్యధిక సెంచరీల జాబితాలో మాత్రం కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు. సచిన్ 49 శతకాలతో అగ్రస్థానంలో ఉండగా.. కోహ్లీ 43 శతకాలు సాధించాడు. ఇదిలా ఉంటే సఫారీ గడ్డపై అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్ గా నిలిచే రికార్డుకు కూడా కోహ్లీ చేరువలో ఉన్నాడు. మరో 22 పరుగులు చేస్తే ద్రావిడ్ ను, 26 రన్స్ చేస్తే గంగూలీని అధిగమిస్తాడు. దక్షిణాఫ్రికాలో 29 మ్యాచ్ లు ఆడిన గంగూలీ 1313 పరుగులు చేయగా…ద్రావిడ్ 36 మ్యాచ్ లలో 1309 పరుగులు చేశాడు. కోహ్లీ ప్రస్తుతం 1287 పరుగులతో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఈ సిరీస్ లో కోహ్లీ గంగూలీ, ద్రావిడ్ రికార్డులను అధిగమిస్తాడు.