ప్రపంచ క్రికెట్ లో విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజే వేరు.. ఆటపరంగా ఎన్నో రికార్డులతో పాటు కోట్లాది మంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్నాడు. కోహ్లీని అభిమానులకు చేరువ చేసింది అతని ఆటతీరే కాదు అతని స్టైల్ కూడా.. ఫ్యాషన్ షోలో మోడల్స్ కు ఏ మాత్రం తగ్గని స్టైల్ కోహ్లీది.
డ్రెస్సింగ్ లోనూ, హెయిర్ స్టైల్, బియర్డ్ స్టైల్ లో కోహ్లీ ఎప్పటికప్పుడు ట్రెండ్ ఫాలో అవుతుంటాడు. ఫిట్ నెస్ విషయంలో క్రికెటర్లందరికీ ఆదర్శంగా నిలిచే కోహ్లీ తన హెయిర్ స్టైల్ లోనూ స్పెషాలిటీ చూపిస్తాడు. అందుకే విరాట్ కు ఫాలోయింగ్ ఓ రేంజ్ లో ఉంటుంది. తాజాగా టీ ట్వంటీ ప్రపంచకప్ కోసం కొత్త హెయిర్ స్టైల్ తో సిద్ధమయ్యాడు విరాట్. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో తొలి టీ ట్వంటీ కోసం మొహాలీలో జట్టుతో కలిసి కోహ్లీ కొత్త లుక్ తో దర్శనమిచ్చాడు. ఫుట్ బాలర్స్ హెయిర్ స్టైల్ తో మరింత స్టైలిష్ గా కనిపిస్తున్నాడు.
ఈ స్టైలిష్ లుక్ ఎలా వచ్చిందీ చూపిస్తూ ఒక వీడియోను కోహ్లీ తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశాడు. అతని హెయిర్ స్టైలిస్ట్ కొత్త లుక్ లో కింగ్ కోహ్లీ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం కోహ్లీ పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇటీవల ఆసియాకప్ తో ఫామ్ లోకి వచ్చిన విరాట్ స్వదేశంలో ఆస్ట్రేలియాతో సిరీస్ లోనూ చెలరేగాలని ఎదురుచూస్తున్నాడు. ఆస్ట్రేలియాతో తొలి టీ ట్వంటీ మొహాలీ వేదికగా మంగళవారం జరగనుంది.